mulug: బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. తల్లిదండ్రుల ముందే ఇద్దరు చిన్నారుల దుర్మరణం
- ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం
- ఇద్దరు కొడుకులతో కలిసి బైక్ పై వెళ్తున్న సురేశ్ దంపతులు
- ఏటూరునాగారం వెళ్తున్న బస్సుతో బైక్ ఢీ
- చిన్నారులు అక్కడికక్కడే మృతి, గాయాలపాలైన తల్లిదండ్రులు
ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లిదండ్రుల ముందే కొడుకులిద్దరూ కన్నుమూశారు. తన ఇద్దరు కుమారులతో కలిసి మాడవి సురేశ్ దంపతులు బైక్ పై మంగపేటకు బయలుదేరారు. తెలంగాణ సెంటర్ వద్ద బస్టాండ్ నుండి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరి బైక్ ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ సూచించారు.
ఈ మేరకు సజ్జనార్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా డ్రైవింగ్ చేసే వారికి సూచనలు చేశారు. 'ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ #TSRTC బస్సును ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటించాలి. ఇలా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.' అంటూ రాసుకొచ్చారు.
బస్సు నేరుగా వెళ్తుండగా.. మరో మార్గంలో వచ్చిన బైకర్ రోడ్డు మధ్యకు రాగానే బస్సు ఢీకొట్టింది. సజ్జనార్ ట్వీట్ పై నెటిజన్లు కూడా స్పందించారు. బైకర్ ది తప్పేనని కొందరు చెబుతుండగా... మరికొందరు అసలు ఆర్టీసీ డ్రైవర్ కు జంక్షన్ వద్ద బస్సును స్లో చేయాలని తెలియదా? అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నించారు. రోడ్డు పైన ట్రాఫిక్ గుర్తులు ఏవని, స్పీడ్ బ్రేకర్ ఎక్కడ అని ప్రశ్నించాడు. బైక్ డ్రైవర్ కు స్కీల్ లేనప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏ ఏజెంట్ ఇప్పించాడని ఓ నెటిజన్ ప్రశ్నల వర్షం కురిపించాడు.