Rishi Sunak: ఒక్కరోజు ఇమిగ్రేషన్ ఆఫీసర్ గా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

Rishi Sunak Turns Immigration Officer For A Day
  • ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్
  • 105 మంది అక్రమ వలసదారులను గుర్తించి అరెస్టు
  • అక్రమ వలసలను అడ్డుకుంటానని గతంలో హామీ ఇచ్చిన సునాక్
ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ ఒక్క రోజు సీఎంగా బాధ్యతలు నిర్వహించడం గుర్తుండే ఉంటుంది. తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఒక్క రోజు ఇమిగ్రేషన్ అధికారిగా మారారు.. గురువారం మిగతా అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి షాపులు, హోటళ్లు తనిఖీ చేశారు. అక్రమంగా దేశంలోకి వలస వచ్చి, అనుమతి లేకున్నా పనిచేస్తున్న వారిని పట్టుకోవడానికి ప్రధాని సునాక్ ఇలా ఒక్క రోజు అధికారిగా మారారు. యూకే వ్యాప్తంగా నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో 105 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలిచిన సమయంలో రిషి సునాక్ అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. అక్రమంగా వలస వచ్చిన వారివల్ల యూకే పౌరులు నష్ట పోతున్నారని, ఉద్యోగాలు దొరకక తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తోందని అన్నారు. ఈ పరిస్థితిని తప్పిస్తానని, అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

అయితే, ఫీల్డ్ లెవల్ లో పరిస్థితులను తెలుసుకోవడానికి, అధికారుల పనితీరుపై అవగాహన కోసం సునాక్ ఇలా ఒక్కరోజు డ్యూటీ చేశారట. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో కలిసి సునాక్ నార్త్ లండన్ లోని బ్రెంట్ ఏరియాలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు హోటళ్లు, షాపులలో పనిచేస్తున్న అక్రమ వలసదారులను గుర్తించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ తో పాటు యూకే వ్యాప్తంగా 159 చోట్ల గురువారం ఈ తనిఖీలు జరిగాయి.
Rishi Sunak
Britain
UK
London
Illegal working
Immigration

More Telugu News