London: లండన్‌లో మరో భారత సంతతి వ్యక్తి హత్య!

Another indian origin man stabbed to death in london
  • పదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న కేరళ వ్యక్తి అరవింద్ శశికుమార్
  • క్యాంబర్‌వెల్ ప్రాంతంలో మరో ముగ్గురు కేరళ వాసులతో అద్దె ఫ్లాట్‌లో నివాసం
  • శుక్రవారం అరవింద్‌కు తన ఫ్లాట్‌లో ఉండే సల్మాన్‌తో తలెత్తిన వివాదం
  • ఘర్షణ ముదరడంతో అరవింద్‌ను కత్తితో పొడిచేసిన సల్మాన్
  • పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే అరవింద్ మృతి 
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 
లండన్‌లో మరో భారత సంతతి వ్యక్తి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. అతడితో కలిసి ఫ్లాట్‌లో అద్దెకుండే మరో భారత సంతతి వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేరళలో పనంపల్లికి చెందిన అరవింద్ శశికుమార్(37) పదేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై బ్రిటన్‌కు వెళ్లాడు. అతడు నగరంలోని కాంబెర్‌వెల్ ప్రాంతంలో ఓ అద్దె ఫ్లాట్‌లో మరికొందరు కేరళ వ్యక్తులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి అరవింద్‌కు, రూంలో తనతో పాటూ ఉండే సల్మాన్ సలీమ్‌తో వివాదం తలెత్తింది. ఈ ఘర్షణ ముదరడంతో సల్మాన్ అరవింద్‌ను కత్తితో పొడిచి చంపాడు. 

కాగా, సమాచారం అందుకున్న పోలీసులు అర్ధారాత్రి 1.30 గంటలకు ఘటనా స్థలికి చేరుకోగా, భవంతి మెట్ల వద్ద అరవింద్ మృతదేహం లభ్యమైంది. ఛాతిపై కత్తిపోట్ల కారణంగా అరవింద్ మృతి చెందినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఈ క్రమంలో పోలీసులు శనివారం నిందితుడు సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. అరవింద్, సల్మాన్ ఘర్షణను చూసిన మరో ఇద్దరు కేరళ వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే నగరంలోని భారత సంతతి యువతి గ్రేసీ ఓ మ్యాలీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వైద్య విద్య చదువుతున్న ఆమెను ఓ వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశాడు.
London

More Telugu News