Virat Kohli: విరాట్ కోహ్లీ నికర ఆస్తి రూ. 1000 కోట్లు.. ఎలా సంపాదిస్తున్నాడంటే?
- కోహ్లీ ఆస్తి వివరాలను వెల్లడించిన ‘స్టాక్ గ్రో’
- 18కిపైగా బ్లాండ్లకు ప్రచారకర్తగా విరాట్
- రూ. 31 కోట్లకుపైగా ఖరీదైన విలాసవంతమైన కార్లు
- ఎండార్స్మెంట్ల ద్వారా ఏడాదికి రూ. 175 కోట్ల ఆర్జన
టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రూ. 1,050 కోట్లకు యజమాని. ‘స్టాక్ గ్రో’ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెటర్లలో ఇంత నికర ఆస్తి ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ ఒక్కడే. 34 ఏళ్ల కోహ్లీ టీమిండియా కాంట్రాక్ట్‌లో ‘ఏ ప్లస్’ ఆటగాడిగా కొనసాగుతూ రూ. 7 కోట్లు అందుకుంటున్నాడు. ప్రతి టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షల చొప్పున తీసుకుంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కింగ్ కోహ్లీ ఏడాదికి రూ. 15 కోట్లు పుచ్చుకుంటున్నాడు.
దీనికి తోడు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ‘బ్లూ ట్రైబ్’, ‘యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్’, ‘ఎంపీఎల్’, ‘స్పోర్ట్స్ కాన్వో’ తదితర ఏడు స్టార్టప్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. 18కిపైగా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీ ఏడాదికి రూ. 7.50 కోట్ల నుంచి రూ. 10 కోట్లు సంపాదిస్తున్నాడు. బాలీవుడ్, స్పోర్ట్స్ ఇండస్ట్రీలో ఇంతమొత్తం సంపాదిస్తున్న ఒకే ఒక్కడు కోహ్లీనే. ఇలాంటి బ్రాండ్ల ఎండార్స్మెంట్ల ద్వారా దాదాపు రూ. 175 కోట్లు ఆర్జిస్తున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుకు రూ. 8.9 కోట్లు, ట్వీట్‌కు రూ. 2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ముంబైలో అతడికున్న ఇంటి విలువ రూ. 34 కోట్లు కాగా, గురుగ్రామ్లోరూ. 80 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. రూ. 31 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు కోహ్లీ యజమాని. అలాగే, ఒక టెన్నిస్ జట్టు, ప్రొ రెజ్లింగ్ జట్టు కూడా ఉన్నాయి.