Comedian Sudhakar: పవన్ కు చిరంజీవి తర్వాత నేనే అన్నయ్యను.. కమెడియన్ సుధాకర్

Comedian Sudhakar about his relationship with Chiranjeevi and Pawan Kalyan
  • ఫాదర్స్ డే సందర్భంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమెడియన్
  • ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చిరు, తను ఒకే రూంలో ఉన్నట్లు వెల్లడి
  • తనకు ఏ అవసరం వచ్చినా మెగాస్టార్ ఆదుకుంటారన్న సుధాకర్
మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్ తోనూ తనకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని కమెడియన్ సుధాకర్ వెల్లడించారు. వయసు పైబడడం, అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరమైన సుధాకర్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కు చిరంజీవి తర్వాత తను కూడా అన్నయ్యనేనని చెప్పుకొచ్చారు. మెగా బ్రదర్స్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, తనకు ఏ అవసరం వచ్చినా చిరు ఆదుకుంటారని తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను, చిరు కలిసి ఒకే రూంలో ఉన్నామని వివరించారు. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని పేర్కొన్నారు.

దాదాపు 45 ఏళ్ల పాటు వివిధ సినిమాల్లో నటించడంతో పాటు పలు సినిమాలు నిర్మించానని సుధాకర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యానని చెప్పారు. ఇటీవల తాను చనిపోయినట్లు మీడియాలో వార్తలు రావడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి బతికే ఉన్నానంటూ చెప్పుకోవాల్సి వచ్చిందని బాధపడ్డారు. ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన టీవీ కార్యక్రమంలో సుధాకర్ తన కుమారుడు బిన్నీతో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఎమ్మెస్ నారాయణ టైమింగ్ బాగుంటుందని, ఆయన కామెడీ తనకెంతో ఇష్టమని చెప్పారు. బ్రహ్మానందం ఇల్లు తన ఇంటికి దగ్గర్లోనే ఉండేదని, అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవారని తెలిపారు. మెగాస్టార్ కు తనంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ అదే అభిమానం చూపిస్తారని చెప్పారు. తనకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటారని సుధాకర్ తెలిపారు. మెగాస్టార్ దీవెనలతో తన కుమారుడు బిన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు సుధాకర్ వివరించారు.
Comedian Sudhakar
megastar
Chiranjeevi
Roommate
Pawan Kalyan
fathers day
entertainment

More Telugu News