Dwarampudi Chandrasekhar Reddy: అన్నయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు... పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంటర్
- వారాహి యాత్రలో వైసీపీ నేతలపై పవన్ ఫైర్
- ఎమ్మెల్యే ద్వారంపూడిపైనా విమర్శలు
- తాను స్వయంకృషితో ఎమ్మెల్యేనయ్యానన్న ద్వారంపూడి
- రెండు చోట్ల ఓడిపోయిన పవన్ తనకెప్పుడూ పోటీ కాదని వెల్లడి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తనపై చేసిన విమర్శల పట్ల కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాను స్వయంకృషితో ఎమ్మెల్యేనయ్యానని చెప్పారు. తానేమీ అన్నయ్య, తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని చురక అంటించారు.
కాకినాడలో కాంగ్రెస్ జెండాలు పాతి ఈ స్థాయికి వచ్చానని, తొలుత కాంగ్రెస్ లో గెలిచానని, ఆ తర్వాత రెండోసారి వైసీపీ నుంచి గెలిచి సీఎం జగన్ నమ్మకాన్ని నిలబెట్టానని ద్వారంపూడి వివరించారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ తనకు ఎప్పటికీ పోటీ కాడని స్పష్టం చేశారు.
పవన్ పై తనకు ఎలాంటి ద్వేషం లేదని, కానీ, పవన్ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. తనపై విమర్శల దాడి చేస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కుతగ్గనని, ప్రతి మాటకు తన వద్ద సమాధానం ఉందని స్పష్టం చేశారు.
తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సానుభూతి కోసమేనని ద్వారంపూడి ఆరోపించారు. పవన్ సభలకు జనాలు రాకపోవడంతో ఇలాంటి సానుభూతి డైలాగులు చెబుతున్నారని విమర్శించారు.