simbu: తమిళ ఇండస్ట్రీలో నటులు వర్సెస్ నిర్మాతలు.. ఐదుగురు స్టార్స్ కు త్వరలో రెడ్ కార్డ్ నోటీసులు?

Simbu Vishal and 3 stars to get red card from TN Producers Council
  • తమిళనాడులో నటులకు, నిర్మాతలకు మధ్య ముదురుతున్న వివాదం
  • అడ్వాన్స్ లు తీసుకుని షూటింగ్ లకు డేట్స్ ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తున్న నిర్మాతలు
  • విశాల్‌, శింబు, యోగిబాబు, ఆధర్వ, ఎస్‌.జె.సూర్యలపై ఆరోపణలు 
  • వాళ్లిచ్చే వివరణతో సంతృప్తి చెందకుంటే రెడ్ కార్డ్ నోటీసులు?
తమిళనాడులో నటులకు, నిర్మాతలకు మధ్య వివాదం ముదురుతోంది. అడ్వాన్స్ లు తీసుకుని షూటింగ్ లకు డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు ఆరోపిస్తుండగా.. సరైన కథలు లేకుండా వస్తే డేట్లు ఎలా సర్దుబాటు చేయాలంటూ నటులు చెబుతున్నారు. ఈ నేపథ్యలో ఐదుగురు స్టార్‌ నటులకు తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి ఝలక్‌ ఇస్తోంది. షూటింగ్‌కు సహకరించని వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ మేరకు ఎన్‌.రామసామి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్మాతల మండలి కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొడ్యూసర్స్‌కు సహకరించని ఐదుగురు నటులను గుర్తించి.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించింది. ఐదుగురు నటులు ప్రొడ్యూసర్ల నుంచి అడ్వాన్స్ లు తీసుకుని, డేట్స్ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా నటులతో సినిమాలు చేయాలనుకుంటే నిర్మాతలు ముందు మండలి దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. 

ఆ ఐదుగురు నటులకు త్వరలోనే నోటీసులు పంపించనున్నట్లు సమాచారం. వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్లిచ్చే వివరణ ఆమోదయోగ్యంగా లేకపోతే రెడ్‌కార్డ్‌ జారీ చేయొచ్చని సమాచారం. అయితే ఆ ఐదుగురు నటులు ఎవరనేది నిర్మాతల మండలి వెల్లడించలేదు. కానీ విశాల్‌, శింబు, యోగిబాబు, ఆధర్వ, ఎస్‌.జె.సూర్యనే అయి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
simbu
vishal
sj suryah
yogi babu
atharvaa
Tamil Nadu Producers Council
red card notices

More Telugu News