TTD: రూ.14 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్లు
- తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- పలు అంశాలపై నిర్ణయాలు
- మీడియాకు వివరించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. రూ.14 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. భారీ వ్యయంతో వసతి గృహాల ఆధునికీకరణ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. రూ.40.50 కోట్లతో వ్యర్థాల నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీకి అనుమతి ఇవ్వాలని తీర్మానించినట్టు వైవీ వెల్లడించారు.
ఇతర నిర్ణయాలు...
- తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ ఆధునికీకరణ
- ఎస్వీ వేదిక్ విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో వసతి గృహాల నిర్మాణం
- టీటీడీ పరిధిలో రూ.7.44 కోట్లతో ఆధునిక కంప్యూటర్
- తిరుపతిలో రూ.9.5 కోట్లతో సెంట్రలైజ్డ్ గోడౌన్
- రూ.97 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునికీకరణ పనులకు ఆమోదం
- ఒంటిమిట్ట రామాలయంలో దాతల సాయంతో రూ.4 కోట్లతో అన్నదాన భవనం
- శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం
- శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు
ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన వారాహి సభలో తిరుమల శ్రీవాణి ట్రస్టు గురించి వ్యాఖ్యానించడం తెలిసిందే. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇస్తే రూ.300కి బిల్లు ఇస్తారని, మిగతా రూ.9 వేలకు పైగా డబ్బు ఎటువెళుతుందో తెలియడంలేదని పేర్కొన్నారు.