gita press: కేంద్రం రూ.1 కోటి నగదు పురస్కారాన్ని తిరస్కరించిన గీతాప్రెస్... ఎందుకంటే?
- నగదు రూపంలో ప్రోత్సాహకాలు తీసుకోకూడదని నిబంధన ఉందన్న సంస్థ
- 2021కి గాను గీతా ప్రెస్ కు గాంధీ శాంతి బహుమతి ప్రకటించిన కేంద్రం
- టార్గెట్ చేసిన కాంగ్రెస్... తిప్పికొట్టిన బీజేపీ
గోరఖ్‌పుర్ కు చెందిన గీతా ప్రెస్ కు కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదికి సంబంధించి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. అవార్డు కింద రూ.1 కోటి నగదు, అభినందన పత్రం, జ్ఞాపిక, ప్రత్యేకమైన హస్త కళాకృతులను అందిస్తుంది. అయితే గీతాప్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన రూ.1 కోటి నగదును గీతాప్రెస్ తిరస్కరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఉంది. నగదు రూపంలో విరాళాలు స్వీకరించకూడదనే నియమం ఉంది.
సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని, గౌరవప్రదమైన విషయమనీ అన్నారు. కానీ ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనేది తమ సూత్రమని, కాబట్టి నగదు రూపంలో వచ్చే అవార్డు ప్రోత్సాహకాలు తీసుకోకూడదని ట్రస్టీ బోర్డ్ నిర్ణయించిందని చెప్పారు. ఈ మొత్తాన్ని వేరేచోట ఖర్చు చేయాలని కోరారు.
కాగా, గీతా ప్రెస్ కు అవార్డు ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. విశిష్ట వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు 1995లో కేంద్రం గాంధీ శాంతి బహుమతిని నెలకొల్పింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని అవార్డు ఎంపిక కమిటి ఆదివారం సమావేశమై ఏకగ్రీవంగా గీతా ప్రెస్ ను ఎంపిక చేసింది. కానీ కాంగ్రెస్ దీనిని తప్పుబట్టింది. సామాన్యుల్లోకి మంచి పుస్తకాలను తీసుకు వెళ్తూ గీతా ప్రెస్ అద్భుతంగా, నిస్వార్థపూరితంగా పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.