Sangareddy District: భార్యను వేధిస్తున్న యువకుడిని డిటెక్టివ్ లా పరిశోధించి పట్టుకున్న భర్త

A Husband from sangareddy turned as detective after getting vulgar messages to wife
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సంఘటన
  • వాట్సాప్ లో అశ్లీల చిత్రాలు పంపుతూ వివాహితకు వేధింపులు
  • లోన్ తీసుకుని చెల్లించట్లేదంటూ పోలీస్ స్టేషన్ కు రప్పించిన వైనం
  • ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన భర్త.. నేరం అంగీకరించిన యువకుడు
వాట్సాప్ లో అశ్లీల చిత్రాలు పంపుతూ భార్యను వేధిస్తున్న ఓ యువకుడిని ఆమె భర్తే చాకచక్యంగా పోలీసులకు పట్టిచ్చాడు. ఓ డిటెక్టివ్ లా పరిశోధన చేసి, నాటకమాడి నిందితుడిని పోలీస్ స్టేషన్ కు రప్పించాడు. ఆపై ఆధారాలను పోలీసులకు అందజేసి కంప్లైంట్ చేశాడు. సినిమా స్టోరీని తలదన్నే ట్విస్టులతో సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సదాశివపేటకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి భార్యను గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా వేధించడం మొదలుపెట్టాడు. వాట్సాప్ లో అశ్లీల చిత్రాలు రావడంతో ఆ గృహిణి తన భర్తకు తెలియజేసింది. భార్యకు ధైర్యం చెప్పిన ఆ భర్త.. నిందితుడిని పట్టుకునేందుకు స్వయంగా పరిశోధన ప్రారంభించాడు. మొబైల్ నెంబర్ ఆధారంగా వివిధ యాప్ ల సాయంతో పరిశోధించగా.. అతను మెదక్ పక్కనే ఉన్న ఓ పల్లెటూరుకు చెందిన యువకుడని తెలిసింది. నిందితుడి ఫొటో కూడా సేకరించిన బాధితురాలి భర్త తన స్నేహితులతో కలిసి ఆ ఊరికి వెళ్లాడు.

లోన్ తీసుకుని ఎగ్గొట్టాడంటూ..
అసలు విషయం బయటపడితే నిందితుడు తప్పించుకునే అవకాశం ఉందని బాధితురాలి భర్త కొత్త నాటకం ఆడాడు. తమ కంపెనీలో లోన్ తీసుకుని తిరిగి చెల్లించడంలేదని నిందితుడి ఫొటో చూపిస్తూ గ్రామంలో విచారించాడు. దీంతో ఆ యువకుడు సంగారెడ్డి దగ్గర్లోనే ఉంటున్నాడని గ్రామస్థులు చిరునామా కూడా ఇచ్చారు. నిందితుడి బంధువు ఫోన్ నెంబర్ కూడా సేకరించాక బాధితురాలి భర్త ఆ ఊరి నుంచి వెనుదిరిగాడు.

నిందితుడినే స్టేషన్ కు రప్పించి..
ఆ బంధువుకు ఫోన్ చేసి మీవాడు మా కంపెనీ నుంచి లోన్ తీసుకున్నాడు, డబ్బులు తిరిగివ్వడంలేదంటూ కావాలని గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో మీ లోన్ సంగతేంటో పోలీస్ స్టేషన్ లోనే తేల్చుకుందాం రమ్మంటూ నిందితుడి బంధువు ఛాలెంజ్ చేశాడు. అన్నట్లుగానే నిందితుడిని వెంటబెట్టుకుని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అప్పటికే అన్ని ఆధారాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితురాలి భర్త.. వాటన్నింటినీ పోలీసుల ముందు పెట్టి తన భార్యను వేధించాడంటూ యువకుడిపై కేసు పెట్టాడు. కళ్ల ముందు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో నిందితుడికి నేరం ఒప్పుకోక తప్పలేదు.
Sangareddy District
mobile phone
vulgar messages
husband
enquiry
caught

More Telugu News