Andhra Pradesh: చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోం..: ఏపీ సీఎం జగన్ హామీ
- విదేశీ వర్సిటీలలో సీటు తెచ్చుకుంటే ఖర్చు మొత్తం ప్రభుత్వానిదేనన్న సీఎం
- మీ జగన్ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులకు హామీ
- విజయవాడలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ప్రసంగం
మట్టిలో మొలిచిన ఈ మొక్కలు భవిష్యత్తులో ప్రపంచానికే ఫలాలు అందించే మహావృక్షాలుగా మారాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పదో తరగతిలో 42 మంది రాష్ట్రస్థాయి టాపర్లు, 26 మంది ఇంటర్ విద్యార్థులకు స్వయంగా అవార్డులను అందజేసి, సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందికి స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను సీఎం అందించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్నిస్థాయుల్లో ప్రతిభ చాటిన 22,710 మంది ఆణిముత్యాల అవార్డులను మంగళవారం అందుకున్నారు. విద్యార్థులను సన్మానించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. కరిక్యులమ్, సిలబస్ మారిందని, ఇంగ్లిష్ మీడియం అన్ని స్కూళ్లలో అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతో ఫీజులను భరిస్తున్నామని వివరించారు.
టెక్నాలజీని చేరువ చేసేందుకు ప్రతీ విద్యార్థికి ట్యాబులు అందిస్తున్నట్లు తెలిపారు. విదేశీ యూనివర్సిటీలలో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆ విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువు కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ‘మీ జగన్ మామా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అంటూ విద్యార్థులకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.