Congress: ధర్మారెడ్డీ.. నా ఇంటి గేటు తెలుసా నీకు?: కొండా మురళి
- మూడు రోజులు నా ఇంటిచుట్టూ తిరిగింది మర్చిపోయావా? అంటూ ఫైర్
- నంది పైపులు అమ్ముకుని బతికిన చరిత్ర ఎమ్మెల్యే ధర్మారెడ్డిది
- మహిళా సర్పంచ్ ను అవమానించాడంటూ మండిపాటు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మండిపడ్డారు. నంది పైపులు అమ్ముకుని బతికిన ధర్మారెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. పరకాలలో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. ధర్మారెడ్డి.. నా ఇంటి గేటు తెలుసా నీకు అంటూ నిలదీశారు. గతంలో ప్రగతి సింగారంలో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం తన ఇంటిచుట్టూ మూడు రోజుల పాటు తిరిగాడని కొండా మురళి చెప్పారు.
మొదట దయాకర్, ఆ తర్వాత శ్రీహరి పంచన చేరి రాజకీయంగా పైకొచ్చాడంటూ విమర్శించారు. పార్టీలు మారుతూ పైకొచ్చిన ధర్మారెడ్డికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. గతంలో మహిళా సర్పంచ్ గా ఉన్న సౌజన్యను ధర్మారెడ్డి అవమానిస్తే తన దగ్గరకు వచ్చి విలపించిందని తెలిపారు. సౌజన్యను ఎంపీపీ చేస్తానని ఆరోజే చెప్పానని, చెప్పినట్లే ఎంపీపీని చేశానని కొండా మురళి వివరించారు.
అధికారం ఎక్కువ రోజులు ఉండదని, అధికార గర్వంతో మాట్లాడడం బాగుండదని ధర్మారెడ్డిని కొండా మురళి హెచ్చరించారు. ధర్మారెడ్డి అరాచకాలు భరించలేక ఆయన కార్యకర్తలే తనవెంట వచ్చేందుకు రెడీగా ఉన్నారని మురళి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వరంగల్ మొత్తానికి బీసీలు ముగ్గురే ఉన్నారని, అందులో కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తమకు ఇద్దరికీ టికెట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పారు.
కొండా మురళి భయపడేవాడు కాదని, భయమనేది తమ వంశంలోనే లేదని చెప్పుకొచ్చారు. పరకాలలో ధైర్యంగా ప్రచారం చేస్తానని, కొండా సురేఖను గెలిపిస్తానని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే నీ అనుచరులతో ఆపాలని సవాల్ విసిరారు. కాళ్లు మొక్కే సంస్కృతి టీఆర్ఎస్ లోనే ఉందని విమర్శించారు. తాము కాళ్లు మొక్కమని, ఆ అలవాటు తమకు లేదని స్పష్టం చేశారు. బ్రాహ్మణుల కాళ్లు మొక్కుతానని తాను గతంలోనే చెప్పానని, సన్నాసుల కాళ్లు మొక్కనని కొండా మురళి చెప్పారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువని కొండా మురళి తెలిపారు.