BRS MLA: సోయం బాపూరావు వ్యాఖ్యల్లో నిజానిజాలు తేల్చాలి.. జోగు రామన్న

BRS MLA Jogu Ramanna Responds on BJP MP Soyam bapurao comments
  • ఎంపీ ల్యాడ్స్ నిధుల దుర్వినియోగంపై విచారణకు ఎమ్మెల్యే డిమాండ్
  • నిధుల దుర్వినియోగం విషయాన్ని బీజేపీ అధిష్ఠానమే తేల్చాలన్న జోగు రామన్న
  • ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెళ్లి కోసం నిధులు వాడుకున్నారంటూ ఆరోపణ
ఎంపీ ల్యాడ్స్ దుర్వినియోగంపై నిజానిజాలు తేల్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకోవడానికి, కొడుకు పెళ్లి చేయడానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకున్నానని ఎంపీ సోయం బాపూరావు చెప్పారని గుర్తుచేశారు. విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం మాటమార్చారని జోగు రామన్న ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానం కలగజేసుకుని, నిజాల నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని అన్నారు.

సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేశారంటూ ఎంపీ సోయం బాపూరావు వాపోవడంపై జోగు రామన్న స్పందించారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ బీజేపీ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడతారని విమర్శించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంతానికి వాడుకున్నట్లు ఒప్పుకున్న సోయం బాపూరావు ఇప్పుడు మాటమార్చి సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ కుట్రలు, నిధుల దుర్వినియోగం ఏమిటో బీజేపీ ఢిల్లీ పెద్దలే తేల్చాలని డిమాండ్ చేశారు. నిజంగానే ఎంపీ ల్యాడ్స్ నిధులను సొంతానికి వాడుకుంటే సోయం బాపూరావుపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
BRS MLA
Jogu Ramanna
Soyam bapurao
MP LADS Funds

More Telugu News