Kiran Royal: ముద్రగడ కాపు కుల ద్రోహి.. కొడుక్కి ఎమ్మెల్యే, ఆయనకు ఎంపీ టికెట్ కోసం దిగజారిపోయారు: జనసేన నేత కిరణ్ రాయల్
- వైసీపీ నిధులతో ముద్రగడ సభలు పెట్టారన్న కిరణ్ రాయల్
- జగన్ సీఎం అయిన తర్వాత కేసులు కొట్టేయించుకున్నారని విమర్శ
- రాష్ట్రంలో ముద్రగడ మాటలు వినే వాళ్లు ఎవరూ లేరని వ్యాఖ్య
జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ఏపీ రాజకీయాలల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తన అధినేతపై ముద్రగడ చేసిన విమర్శలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. ముద్రగడ కాపు కుల ద్రోహి అని జనసేన నేత కిరణ్ రాయల్ దుయ్యబట్టారు. వైసీపీ నిధులతో సభలు పెట్టిన ముద్రగడ కాపు కులం గురించి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.
గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో వైసీపీ ఇచ్చిన నిధులతో తునిలో సభపెట్టి, అక్కడ రైలును ముద్రగడ తగులబెట్టించారని... జగన్ సీఎం అయిన తర్వాత తనపై ఉన్న రైలు దగ్ధం కేసులను కొట్టేయించుకున్నారని విమర్శించారు. ఇప్పుడు జగన్ కు జిందాబాద్ కొట్టే పరిస్థితికి వచ్చారని అన్నారు. కొడుక్కి ఎమ్మెల్యే సీటు, తనకు ఎంపీ సీటు కోసం ముద్రగడ దిగజారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ కాపు నాయకుడు కాదని... కాపు కుల ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేసిన ముద్రగడ... ఇప్పుడు కాపు రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడటం లేదని కిరణ్ ప్రశ్నించారు. ముద్రగడ జగన్ మనిషే కదా... ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ ను రిజర్వేషన్ల గురించి అడగొచ్చు కదా? ఉద్యమాలు చేయొచ్చు కదా? ఆ పని మాత్రం చేయరని ఎద్దేవా చేశారు. ఏపీలో ముద్రగడ వెంట నడిచే వారు కానీ, ఆయన మాట వినేవారు కానీ ఎవరూ లేరని అన్నారు. పవన్ ను తిట్టే కాపులు నలుగురు ఉన్నారని... వారికి ఇప్పుడు ముద్రగడ తోడయ్యారని, అంతకు మించి ఏమీ లేదని చెప్పారు.