Pawan Kalyan: మనకు అండగా నిలవని వాడు ముస్లిం నాయకుడు అయితే ఏంటి, హిందూ నాయకుడు అయితే ఏంటి?: పవన్ కల్యాణ్
- కాకినాడలో ముస్లింలతో పవన్ కల్యాణ్ సమావేశం
- తాను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చానని పవన్ వెల్లడి
- ముస్లింలు తనను నమ్మితే అండగా నిలవాలని విజ్ఞప్తి
- వచ్చే ఎన్నికల్లో ముస్లింలు జనసేనకు మద్దతు ఇవ్వాలన్న జనసేనాని
కాకినాడ నగర ముస్లింలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తాను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చానని, తాను మిగతా రాజకీయ పార్టీల నేతల్లా కాకుండా ఒక సోదరుడిలా, ఒక మనిషిగా, ఒక భారతీయుడిగా మాట్లాడతానని స్పష్టం చేశారు. ఏ మతంలోనైనా అతివాద భావజాలాన్ని మన అందరం ఖండించాలని పిలుపునిచ్చారు.
1947లో జిన్నా తీసుకున్న నిర్ణయం వల్ల ముస్లింలకు ప్రత్యేక దేశం అనే కారణంగా పాకిస్థాన్, భారత్ దేశాలు మత ప్రాతిపదికన విడిపోయాయని పవన్ కల్యాణ్ వివరించారు. నిజంగా భారతదేశం దుర్మార్గమైనదే అయితే 17 శాతం ఉన్న ముస్లింలు ఇలా కలిసి ఉండలేరని అభిప్రాయపడ్డారు.
విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి చాలామంది హిందువులు పారిపోయారని, చాలామందిని చంపేశారని... కానీ భారతదేశంలో మాత్రం హిందువులు, ముస్లింలు కలిసే ఉన్నారని, అది మనదేశ గొప్పదనం అని వివరించారు. కొంతమంది రాజకీయ నాయకుల వల్లనే సమస్యలు, ఘర్షణలు వస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిజంగా మతాన్ని నమ్మేవాళ్లతో ఇబ్బంది లేదని, మతాన్ని రాజకీయం చేసేవాళ్లతోనే ఇబ్బంది అని అన్నారు.
"నేను హిందువును. మీరు నా సహోదరుల వంటివారు. నేను సత్యాన్ని నమ్ముతాను. నాపై మీకు నమ్మకం ఉంటే నాకు, నా పార్టీకి అండగా ఉండండి. గత ఎన్నికల్లో 3 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ముస్లింలకు కేటాయించాను. ఇటీవల రంజాన్ మాసంలో మసీదు, ముస్లిం విద్యా సంస్థల అభివృద్ధి కోసం రూ.25 లక్షలు ఇచ్చాను. అధికారంలోకి వస్తే ఇంకెంత చేయగలనో అర్థం చేసుకోండి . నేను, మీరు ఒకటే... నన్ను పరాయివాడిగా చూడొద్దు... నన్ను కూడా మీలో ఒకడిగా భావించండి.
మొన్న కడపలో మైనారిటీ అమ్మాయిపై అత్యాచారం జరిగితే జనసేన స్పందించింది కానీ అక్కడున్న డిప్యూటీ సీఎం స్పందించలేదు. నన్ను నమ్ముతారా, అతడ్ని నమ్ముతారా? మనకు అండగా నిలవని వాడు ముస్లిం అయితే ఏంటి హిందువు అయితే ఏంటి? ఈసారి ఎన్నికల్లో ముస్లింలు జనసేనకు మద్దతు ఇవ్వండి... మీకోసం మరింత పనిచేస్తాను" అంటూ పవన్ కల్యాణ్ ముస్లింలతో సమావేశంలో తన మనోభావాలు వెల్లడించారు.