Telugudesam: వైసీపీ ఎంపీయే ఏపీలో బతకలేమంటున్నారు: టీడీపీ నేత అచ్చెన్నాయుడు
- రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు
- అమర్నాథ్ హత్య, విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్, మహిళపై దాడుల వివరాలు చెప్పిన టీడీపీ
- పదిహేను రోజుల వ్యవధిలో రాష్ట్రంలో పదిహేను ఘటనలు జరిగాయని ఆవేదన
అధికార వైసీపీ ఎంపీయే రాష్ట్రంలో బతకలేమని అంటున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడులపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, బోండా ఉమ తదితరులు రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. విద్యార్థి అమర్నాథ్ హత్య ఘటనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్, మహిళపై దాడుల గురించి గవర్నర్ కు వివరించారు.
అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... తమ అభ్యర్థనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. పదిహేను రోజుల వ్యవధిలో రాష్ట్రంలో పదిహేను ఘటనలు జరిగాయన్నారు. అయినప్పటికీ శాంతిభద్రతలు బాగున్నాయని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆర్టికల్ 355 అమలు చేయాలని, శాంతిభద్రతల పర్యవేక్షణకు మణిపూర్ తరహాలో ఏపీలో కూడా అధికారిని నియమించాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు.