Odisha: రైలు ప్రమాదం తర్వాత సిగ్నల్ బాధ్యుడు పరారయ్యాడంటూ హోరెత్తించిన మీడియా.. నిజమేంటో చెప్పిన అధికారులు
- ఈ నెల 2న బాలాసోర్‌లో రైలు ప్రమాదం
- ప్రమాదం తర్వాత సోరో సెక్షన్ సిగ్నల్ బాధ్యుడు కుటుంబంతో పరారయ్యాడంటూ వార్తలు
- ఆయన ఇంటిని సీబీఐ సీజ్ చేసిందన్న మీడియా
- తప్పుడు వార్తలన్న ఆగ్నేయ రైల్వే సీపీఆర్వో ఆదిత్యకుమార్
ఒడిశాలో ఈ నెల 2న జరిగిన రైళ్ల ప్రమాదంలో జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయం వెలుగు చూసిందని, బహనగర్ సిబ్బంది ఒకరు పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో ప్రమాదంలో కుట్రకోణం ఉన్నట్టు తెలుస్తోందంటూ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని ఆగ్నేయ రైల్వే సీపీఆర్వో ఆదిత్యకుమార్ చౌదరి పేర్కొన్నారు. సిబ్బంది అందరూ సీబీఐ, సీఆర్ఎస్ ఎదుట విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు.
బాలాసోర్ రైళ్ల ప్రమాదం తర్వాత సోరో సెక్షన్ సిగ్నల్ బాధ్యుడైన జూనియర్ ఇంజినీర్ నివసించే అద్దె ఇంటిని సీబీఐ అధికారులు సీజ్ చేశారని, ఆయన కుటుంబంతో సహా పరారయ్యాడని వార్తలు వచ్చాయి. ఆయన మిస్సింగ్‌తో ప్రమాదంలో కుట్రకోణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇప్పుడు రైల్వే అధికారులు ఈ వార్తలను నిరాధారమైనవిగా కొట్టిపడేశారు. కాగా, రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య తాజాగా 292కి పెరిగింది.