dog bites: కుక్క కాట్లకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమా?
- కుక్క కాట్లు పెరగడంపై హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం
- అధిక ఉష్ణోగ్రతలు దూకుడును పెంచుతాయని వెల్లడి
- అమెరికాలో 69,525 కుక్క కాట్లను విశ్లేషించిన శాస్త్రవేత్తలు
- ఎండాకాలంలోనే ఎక్కువగా దాడులు జరిగినట్లు గుర్తింపు
మనుషులపై కుక్కల దాడులు ఇటీవల పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు పిల్లలపై దాడులు చేస్తూ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నిజానికి మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ ఇలాంటి సంఘటనలు ఏదో ఒకచోట నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుక్క కాట్లు పెరిగిపోవడానికి గల ఆసక్తికర కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్లే కుక్కలు దాడులు చేస్తున్నాయని వెల్లడించారు.
మనుషులపైనే కాదు.. కుక్కలు సహా ఇతర జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం పడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. కుక్క కాటుకు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మధ్య సంబంధం ఉందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవలి అధ్యయనంలో వెల్లడించారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో ప్రచురితమైంది. ఈ స్టడీలో భాగంగా మనుషులపై కుక్కల దాడులను పర్యావరణ కారకాలు ప్రభావితం చేస్తాయా? అనే విషయంపై పరిశోధన చేశారు.
‘‘పెరుగుతున్న ఉష్ణోగ్రత, ఓజోన్ స్థాయులతో కుక్క కాట్లు పెరుగుతాయని మేము కనుగొన్నాం. అధిక యూవీ రేడియేషన్ స్థాయి, కుక్క కాట్లు పెరగడానికి మధ్య పరస్పర సంబంధాన్ని మేం గుర్తించాం’’ అని రీసెర్చర్లు పేర్కొన్నారు.
‘‘దూకుడు, దాడి చేయడమనేది.. అన్ని జాతుల్లోనూ ఉండే ఒక సాధారణ ప్రవర్తన. తమ భూభాగాలను రక్షించుకోవడం, ఆహారం తదితర వనరులను కాపాడుకోవడం, సహచరుల కోసం పోటీపడటం, తమ వారిని రక్షించడం.. వంటి విషయాల్లో దాడులకు దిగుతాయి. అధిక ఉష్ణోగ్రతలు మానవుల్లో దూకుడును పెంచుతాయని గతంలోనే తేలింది. కానీ కోతులు, ఎలుకల్లోనూ ఇలాంటి ప్రవర్తన ఉంటుందని గుర్తించాం. కుక్కలు మనుషులను కరవడమనేది.. అధిక ఉష్ణోగ్రతలతో ముడిపడి ఉంది’’ అని పేర్కొన్నారు.
తమ స్టడీ కోసం 2009 నుంచి 2018 దాకా అమెరికాలోని 8 నగరాల్లోని కుక్కకాట్లను పరిశోధకులు పరిశీలించారు. 69,525 కుక్క కాట్లను విశ్లేషించారు. సెలవు దినాలు, వానాకాలంలో కంటే.. ఎండాకాలంలోనే కుక్కల దాడులు ఎక్కువగా జరిగినట్లు కనుగొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వేడిని ప్రపంచం భరిస్తోందని, జంతువుల విషయంలో వెంటనే శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని సూచించారు.