Tamil Nadu: ఇది దైవలీలా? పూజలు లేని రోజుల్లో గుడి గంట మోగిస్తున్న కాకి!
- తమిళనాడు తెన్‌కాశీ జిల్లా సెంగోటై ప్రాంతంలో విచిత్ర ఘటన
- స్థానిక ఆలయంలో వారంలో అయిదు రోజులు గంట మోగించి వెళుతున్న కాకి
- పూజ జరగని రోజుల్లోనే వచ్చి వెళుతున్న కాకి
- స్థానికంగా చర్చనీయాంశమవుతున్న ఘటన
తమిళనాడు తెన్‌కాశీ జిల్లాలో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. సెంగోటై సమీపంలోని చెరువు వద్ద ఉన్న విఘ్నేశ్వరుడి ఆలయంలో ఓ కాకి వచ్చి గంట మోగించి వెళుతోంది. బుధ, శనివారాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే భక్తులు దేవుడి దర్శనం కోసం వస్తారు. పూజారి కూడా ఈ రోజుల్లోనే పూజాదికాలు నిర్వహిస్తారు. కాగా, ధూపదీప నైవేద్యాలు లేని మిగిలిన రోజుల్లో ఓ కాకి వచ్చి గంట మోగించి వెళ్లడాన్ని ఇటీవల స్థానికులు గమనించారు. దీంతో, ఈ ఉదంతం పెద్ద చర్చకు దారి తీసింది.
ఉదయం 7 గంటలకు ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు కాకి వచ్చి గంట మోగిస్తోందని ఆలయం సమీపంలో టీ దుకాణం నడుపుకునే ఓ వ్యక్తి చెప్పారు. తొలుత తామూ పెద్దగా పట్టించుకోలేదని, అయితే పూజ జరగని రోజుల్లోనే కాకి వచ్చి వెళుతుండటం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చారు.