YS Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల.. జోరుగా ప్రచారం!
- తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ ప్రచారం
- రాహుల్ గాంధీ విదేశాల నుంచి వచ్చాక కొలిక్కి వస్తుందన్న కాంగ్రెస్ వర్గాలు
- ఏపీ బాధ్యతలు అప్పగించాలంటున్న తెలంగాణ నేతలు
- షర్మిల తెలంగాణ ఆడబిడ్డగా ప్రచారం చేసుకుంటున్నారన్న మరికొందరు
- అందరి చూపు అధిష్ఠానం వైపే
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా? తన పార్టీని అందులో విలీనం చేయబోతున్నారా? ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ వార్తలను షర్మిల స్వయంగా కొట్టిపడేసినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు మొదలైన ప్రచారం ఆ తర్వాత ఆగిపోయినా మళ్లీ ఇప్పుడు ఊపందుకుంది.
నాలుగు రోజుల క్రితం పార్టీ ముఖ్య నేతలు ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఇదే విషయమై చర్చించారని, విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, షర్మిల కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందని తెలంగాణ నాయకులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడి ఆడబిడ్డగా ప్రచారం చేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాడేరు నుంచి పోటీకి సిద్ధమవుతున్న విషయాన్ని మరికొందరు నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.