Karna: కర్ణాటకలో అరుదైన ఘటన.. తండ్రికి బదిలీ కావడంతో కూతురికి ఠాణా బాధ్యతలు
- కర్ణాటకలోని మాండ్య ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై వెంకటేశ్ బదిలీ
- అదే స్టేషన్‌కు నూతన ఎస్సైగా వచ్చిన వెంకటేశ్ కూతురు వర్ష
- తండ్రి నుంచి రాజదండం, పుష్ఫగుచ్ఛం స్వీకరించిన వైనం
- కూతురిని చూసి గర్వంగా ఉందన్న తండ్రి
కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బదిలీపై వెళుతున్న ఓ పోలీసు అధికారి, ఠాణా బాధ్యతలను ఎస్సై అయిన తన కూతురికి అప్పగించారు. మాండ్య సెంట్రల్ ఠాణాకు ఎస్సైగా వర్ష నియమితులయ్యారు. అదే స్టేషన్లో అధికారిగా వ్యవహరిస్తున్న వర్ష తండ్రి వెంకటేశ్‌కు బదిలీ అయ్యింది. ఈ సందర్భంగా.. తండ్రి నుంచి వర్ష రాజదండాన్ని-పుష్పగుచ్ఛాన్ని స్వీకరించారు.
వెంకటేశ్ సైన్యంలో 16 ఏళ్ల పాటు సేవలు అందించి, 2010లో ఎస్సై పరీక్షలు రాసి ఎంపికయ్యారు. గత 13 ఏళ్లల్లో వివిధ ఠాణాల్లో సేవలందించారు. ఆయన కుమార్తె వర్ష గత ఏడాది ఎస్సైగా ఎంపికయ్యారు. ఏడాది పాటు ప్రొబేషనరీ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆమె మండ్య ఠాణాకు ఎస్సైగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. కాగా, కూతురిని చూసి గర్వంగా ఫీలయ్యానని వెంకటేశ్ చెప్పారు. తండ్రి నుంచి ఈ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని వర్ష పేర్కొన్నారు.