Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ల జారీ
- అవినీతి కేసులో ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత రెచ్చిపోయిన మద్దతుదారులు
- పాక్ వ్యాప్తంగా పెచ్చరిల్లిన హింస
- ఈ కేసులో ఇమ్రాన్‌పై రెండు ఎఫ్ఐఆర్‌లు
- ఇమ్రాన్ సహా మరో ఆరుగురిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశం
పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. అవినీతి కేసులో ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మే 9న జరిగిన ఈ అల్లర్లకు సంబంధించిన రెండు కేసుల్లో కోర్టు ఇమ్రాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇమ్రాన్‌ఖాన్, పీటీఐ నేతలపై మే 10న పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
పాక్ అధికార పార్టీ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ కార్యాలయంపైనా, ఓ కంటెయినర్‌పైనా దాడి చేసి నిప్పు పెట్టిన ఆరోపణలపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఈ వారెంట్లు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇమ్రాన్‌తోపాటు మరో ఆరుగురు పార్టీ నేతలను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.