KTR: జ్వలించే దీపం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.. వాళ్లను మా గుండెల్లో పెట్టుకుంటాం: కేటీఆర్
- రాష్ట్రం కోసం అమరులైన త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటామన్న కేటీఆర్
- లంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని కితాబు
- దేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామన్న మంత్రి
రాష్ట్రం కోసం అమరులైన త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితమవుతామని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకస్తూపం, జ్వలించే దీపం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికమని కొనియాడారు. మన అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడమని చెప్పారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన సకల దరిద్రాలను శాశ్వతంగా దూరంచేసి.. తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించడమన్నారు.
‘ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతం, ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికం.. తెలంగాణ సాధనోద్యమం. మన అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదు, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడం. దశాబ్దాలుగా పట్టిపీడించిన సకల దరిద్రాలను శాశ్వతంగా దూరం చేసి తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించడం. అమరుల ఆశయాలే స్ఫూర్తిగా, ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరిగా, తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లుగా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే మహాయజ్ఞం మహోద్యమంగా సాగిందనడానికి తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే నిలువెత్తు నిదర్శనం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటయోధుల కలలు 75 ఏళ్లు దాటినా నెరవేరలేదన్నారు. కానీ తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేర్చి వచ్చే వందేళ్లకు బలమైన పునాది వేసిన సంకల్పమే యావత్ దేశానికి తెలంగాణ నేర్పుతున్న పరిపాలనా పాఠం ప్రతిజ్ఞచేస్తున్నామని చెప్పారు. ‘హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకస్తూపం – జ్వలించే దీపం సాక్షిగా త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటాం. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితం అవుతాం. మాటిస్తున్నం.. లక్ష్యం కోల్పోయిన భారత దేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతాం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.