Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం కుమార్తెకు లింగమార్పిడి శస్త్రచికిత్స
- పురుషుడిగా మారనున్న సుచేతన భట్టాచార్య
- తాను మానసికంగా పురుషుడినేనని వెల్లడి
- శారీరకంగానూ పురుషుడిగా మారాలని అనుకుంటున్నట్టు వెల్లడి
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అనంతరం సుచేతన్ గా మారాలని (పురుషుడిగా) నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం న్యాయపరమైన సలహా తీసుకోనుంది. ఇందుకు సంబంధించి కావాల్సిన సర్టిఫికెట్ ల కోసం వైద్యులను సంప్రదించినట్టు సమాచారం. సుచేతన ఇటీవలే ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్) వర్క్ షాప్ కు హాజరైంది.
తనను తాను పురుషుడిగా సుచేతన భట్టాచార్య చెప్పుకుంటోంది. అందుకే పురుషుడిగా మారేందుకు శస్త్రచికిత్స మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘‘నా తల్లిదండ్రుల గుర్తింపు లేదా కుటుంబం గుర్తింపు పెద్ద అడ్డంకి కాబోదు. నేను ఎల్జీబీటీక్యూ ఉద్యమంలో భాగంగా ఇది చేస్తున్నాను. ట్రాన్స్ మ్యాన్ గా సోషల్ మీడియాలో నేను ఎదుర్కొంటున్న వేధింపులకు చెక్ పెట్టాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు 41 ఏళ్లు. నా జీవితానికి సంబంధించి నిర్ణయాలు నేనే తీసుకోగలను. ఈ అంశంలోకి నా తల్లిదండ్రులను తీసుకురావద్దు. మానసికంగా నన్ను నేను పురుషుడిగా భావిస్తున్నందున భౌతికంగానూ పురుషుడిగా మార్పును కోరుకుంటున్నాను’’ అని సుచేతన భట్టాచార్య తెలిపింది.