Nara Lokesh: వీవర్స్ డైరెక్ట్ వెబ్ సైట్ ప్రారంభించిన నారా లోకేశ్

Nara Lokesh inaugurates Weavers Direct website

  • చేనేత‌ల‌కి అధునాత‌న శిక్ష‌ణ‌, ఉత్ప‌త్తుల‌కి డైరెక్ట్ మార్కెటింగ్ 
  • 5 ల‌క్ష‌ల మందికి మెరుగైన ఉపాధి క‌ల్పించేలా ప్ర‌ణాళిక 
  • పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో అమలు
  • రాష్ట్రమంతటా తీసుకువచ్చేందుకు లోకేశ్ కార్యాచరణ

రాష్ట్రంలో చేనేత రంగం రూపురేఖలు మార్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వేసిన తొలి అడుగు లక్షలాది చేనేత కార్మికుల భ‌విత‌కి బంగారు బాట కానుంది. మంగ‌ళ‌గిరిలో చేనేత‌ల కోసం లోకేశ్ మ‌దిలో మొగ్గ తొడిగిన ఆలోచ‌న‌ వెంక‌ట‌గిరిలో  www.weaversdirect.in రూపంలో అందుబాటులోకి వ‌చ్చింది. 

యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ఇవాళ వీవర్స్ డైరెక్ట్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌నకి నారా లోకేశ్ క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌. చేనేత‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపేందుకు మ‌హాయ‌జ్ఞంగా చేప‌ట్టిన ఈ ప్రాజెక్టుకి  స‌హాయ స‌హ‌కారాలు అందించిన ఎన్నారైలు శాంతి న‌రిశెట్టి (లాస్ ఏంజెల్స్), మాధ‌వి మార్త (ఛార్లెట్టె), అనూరాధ (న్యూజెర్సీ)ల‌కు  లోకేశ్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 

వెబ్ సైట్ ప్రారంభ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ మంగళగిరి లో అనుసరిస్తున్న మోడల్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఇదే ప్రణాళిక అమలు చేస్తామని అన్నారు. వెంకటగిరిలో కూడా చేనేత రంగానికి ఎంతో మంది దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారందరినీ మళ్ళీ చేనేత వృత్తి వైపు వచ్చేలా చెయ్యడమే తన లక్ష్యం అని లోకేశ్ ఉద్ఘాటించారు. 

మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గంలో  30,000 మందికి పైగా చేనేత కార్మికులున్నారు. ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంలో చేనేత కార్మికులు, డై వర్కర్స్ తో లోకేశ్ మాట్లాడి వారి సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. పాల‌సీ మార్చితే స‌రిపోదని, స‌మూలంగా వ్య‌వ‌స్థ‌లో మార్పులు తేవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. క్షేత్ర‌స్థాయిలో చేనేత‌ల‌తో మాట్లాడిన‌వి, ఆయా రంగాల నిపుణుల‌తో చ‌ర్చించిన‌వి, మార్కెటింగ్ అవ‌కాశాలు ప‌రిశీలించిన‌వి అన్నీ అధ్య‌య‌నం చేసిన త‌రువాత ఓ ప్ర‌ణాళిక రూపొందించారు. 

చేనేత కార్మికులకు చేయూత‌నందించే ప్ర‌ణాళిక రూపొందించి పైల‌ట్ ప్రాజెక్టుగా మంగ‌ళ‌గిరి నుంచి ఆరంభించారు. ఇది విజ‌య‌వంతమైతే రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల మంది చేనేత‌ల‌కి మెరుగైన జీవ‌న ప్ర‌మాణాల‌తో అదే వృత్తి ద్వారా స్వ‌యం ఉపాధి క‌ల్పించే అద్భుత అవ‌కాశం ఉంది.

లోకేశ్ చేప‌ట్టిన ప్రాజెక్టులో ముఖ్యాంశాలు 

చేనేత కార్మికులు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో రోజుకి 12 గంట‌లు ప‌నిచేస్తున్నారు. వీరికి కొత్త టెక్నాలజీ వాడ‌డం నేర్పి అందుబాటులోకి తీసుకురావ‌డం ద్వారా 30 శాతం ఉత్ప‌త్తి పెరిగింది.  హైస్పీడ్ చ‌ర‌ఖా, రాక్ లూమ్స్, మెకానికల్ లిఫ్ట‌ర్స్ వంటివి కార్మికులు వాడ‌టం వ‌ల్ల వారి ఆరోగ్యం మెరుగుప‌డ‌టంతోపాటు త‌క్కువ గంట‌ల్లో ఎక్కువ ఉత్ప‌త్తి సాధించగ‌లుగుతున్నారు. 
 
ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాల‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల‌ డైయింగ్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక‌మైన గ్లోవ్స్‌, బూట్లు లోకేశ్ స‌ర‌ఫ‌రా చేశారు. కేంద్ర‌ప్ర‌భుత్వ  సహకారంతో నడుస్తున్న వీవర్ రిసోర్స్‌ సెంటర్ ద్వారా కొన్ని ప‌నిముట్లు అంద‌జేస్తే, ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు-రంగుల నుంచి కార్మికుల‌కి కొంత ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

రోజుల‌ కొద్దీ ఇంటిల్లిపాదీ క‌ష్ట‌ప‌డి నేసిన చీర‌లు, వ‌స్త్రాలు ద‌ళారుల చేతికి చిక్కుతున్నాయి. దీంతో లాభాలు రావ‌డంలేదు. చేనేత‌ల్ని దోచుకునే మ‌ధ్య ద‌ళారీల‌కి చెక్ పెట్టి నేరుగా తాము నేసిన చీర‌లు, వ‌స్త్రాలు తామే అమ్ముకునేలా కొన్ని కార్పొరేట్ సంస్థలతో టై అప్ కుదిర్చారు. ప్ర‌పంచంలో ఏ మూల‌నుంచైనా మంగ‌ళ‌గిరి చీర‌లు, వ‌స్త్రాలు ఆన్ లైన్‌లో ఆర్డ‌ర్ చేయొచ్చు. వ‌చ్చే లాభం నేరుగా చేనేత‌ల‌కే చేరుతుంది. చేనేత ఉత్ప‌త్తులు నేరుగా వినియోగదారుల‌కు చేర్చే వెబ్ సైట్ www.weaversdirect.in. లోకేశ్ తన బృందంతో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆధునిక కాలంలో అవ‌స‌రాలు, అభిరుచుల‌కు అనుగుణంగా వ‌స్త్రాలు త‌యారు చేసేందుకు ముందుగా శిక్ష‌ణ ఇచ్చేలా ఒక అధునాతనమైన శిక్ష‌ణాకేంద్రం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సెంటర్ రూపొందిస్తున్నారు. న్యూ టెక్నాలజీ, మోడ్రన్ డిజైన్స్ త‌యారు చేసి చేనేత‌ ఉత్ప‌త్తుల‌కి ప్ర‌పంచ‌స్థాయి బ్రాండ్ క్రియేట్ చేయాల‌ని యోచిస్తున్నారు. చీర‌ల అమ్మ‌కాలు 20 శాతమైతే, గార్మెంట్స్ 50 శాతం అమ్మ‌కాలు సాగుతున్నాయి. అందుకే గార్మెంట్స్ త‌యారీలోనూ చేనేత‌ల‌కి శిక్ష‌ణ ఇప్పించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News