KCR: అంతటి దాడి ప్రపంచంలో ఎవరిపైనా జరగలేదు: సీఎం కేసీఆర్
- అమరవీరుల స్మారకం, అమరజ్యోతిని ప్రారంభించిన సీఎం
- అమరుల కుటుంబ సభ్యులను సత్కరించిన ప్రభుత్వం
- కుట్రలు, కుతంత్రాలు జరిగినా ధైర్యంగా పోరాడి తెలంగాణ సాధించామన్న కేసీఆర్
తెలంగాణ ఉద్యమం సమయంలో తనపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపై జరిగి ఉండకపోవచ్చునని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రాజీనామాలను అస్త్రాలుగా వాడి ఉద్యమాన్ని నడిపించామన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులుబాసిన అమరులకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించింది. హైదరాబాద్ లో నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్మారకం, అమరజ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంతచారి, వేణుగోపాల్ రెడ్డి, పోలీస్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య కుటుంబ సభ్యులను సత్కరించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగినా ధైర్యంగా పోరాడి తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల సందర్భంగా జరిగిన ఘట్టాలను గుర్తు చేశారు. రాష్ట్ర ఉద్యమానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లను తలుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఇల్లందులో తొలి ఉద్యమ కేక వినిపించిందన్నారు. ఉద్యమం ప్రారంభానికి ముందు పిడికెడు మందితో మేధోమథనం చేశామని, వ్యూహాత్మకంగా మలిదశ ఉద్యమం ప్రారంభించామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది అన్నారు. ఆయన మార్గంలో నడిచి, ఆయన స్ఫూర్తిని కాపాడుతూ వచ్చామన్నారు.
కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఉద్యమాన్ని నడిపామన్నారు. తన నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. ఆ తర్వాత ఎన్నో కుట్రలు జరిగాయన్నారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లే స్థాయికి దిగజారారన్నారు. ఉద్యమంలో విద్యార్థుల ఆత్మబలిదానాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. అమరులను నిత్యం స్మరించుకోవడానికి అమరజ్యోతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కాస్త ఆలస్యం జరిగిందన్నారు.