Pawan Kalyan: నేను అసెంబ్లీకి వెళ్లుంటే కనీసం లక్ష ఉద్యోగాలు పడేవి: పవన్ కల్యాణ్
- అమలాపురంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
- బహిరంగ సభలో వాడీవేడిగా ప్రసంగం
- 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని విమర్శలు
- నవ్వుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వచ్చే వ్యక్తిని నిలదీయాలని పిలుపు
- హలో ఏపీ... బై బై వైసీపీ అంటూ జనసేన ఎన్నికల నినాదం ప్రకటించిన పవన్
రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశాడని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలని నిలదీశారు. అమలాపురంలో వారాహి విజయ యాత్ర అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ... గత ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు యువత ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేదని అన్నారు. ఓట్లు వేసి వైసీపీని గెలిపించారని, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదని తెలిపారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలు పడేవని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇంకోసారి వారి నాయకుడు నవ్వుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వస్తే రోడ్డుపైనే నిలదీయండి... 2.3 లక్షల ఉద్యోగాలు ఏవని గట్టిగా ప్రశ్నించండి అని పిలుపునిచ్చారు.
"రాష్ట్రానికి పట్టిన వైసీపీ తెగులును తీసేస్తా... వచ్చే ఎన్నికల్లో నాకు అండగా నిలబడండి. నేనేమీ హైదరాబాద్ నుంచి మాట్లాడడంలేదు... రాజమండ్రిలో పార్టీ ఆఫీసు పెట్టాను. కాకినాడ, పిఠాపురం, అమలాపురంలోనూ కార్యాలయాలు తెరుస్తాం. నేను కూడా ఇక్కడే ఉంటాను... మా ఇన్చార్జులు కూడా ఇక్కడే ఉంటారు. ఈసారి జనసేనకు గోదావరి జిల్లాలు అండగా ఉండాలి. గోదావరి నదిలా ఇక్కడి ప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉంటాను" అని వివరించారు.
క్లాస్ వార్ చేస్తోంది జగనే. క్లాస్ వార్ కు ఆయన ప్రతిరూపం లాంటివాడు. 24 దళిత పథకాలు రద్దు చేశాడు, భవన నిర్మాణ కార్మికులు నిధి మళ్లించాడు, ఉద్యోగుల పెన్షన్ సొమ్ము మళ్లించాడు... ఈ వ్యక్తి క్లాస్ వార్ గురించి ఎలా మాట్లాడతాడు?"
అభివృద్ధి జరగాలంటే- ఈ ప్రభుత్వం మారాలి
అరాచకం ఆగాలంటే- ఈ ప్రభుత్వం పోవాలి
జనం బాగుండాలంటే- జగన్ పోవాలి... అంటూ పవన్ కల్యాణ్ సభకు వచ్చిన వారితో నినాదాలు చేయించారు.