Jagan: జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ 18 మంది ఎమ్మెల్యేలు వీరేనంటూ ప్రచారం!
- పనితీరు మెరుగుపరుచుకోలేని వారికి టికెట్ ఇవ్వలేనని హెచ్చరించిన జగన్
- 18 మంది పనితీరు దారుణంగా ఉందని అసహనం
- ఆ 18 మంది ఎవరనే దానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ
పనితీరు మెరుగు పరుచుకోలేని, గ్రాఫ్ ను పెంచుకోలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేనంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన హెచ్చరిక వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరు అత్యంత దారుణంగా ఉందని... వారితో తాను స్వయంగా మాట్లాడతానని ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా జగన్ చెప్పారు. పనితీరు బాగోలేని వారికి టికెట్ ఇవ్వడం వల్ల వారికీ నష్టం, పార్టీకీ నష్టమని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మరోవైపు ఆ 18 మంది వీళ్లేనంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జగన్ అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనలేని వారే ఉన్నారని చెపుతున్నారు. వీరిలో పినిపె విశ్వరూప్, గుడివాడ అమర్ నాథ్, కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్, తానేటి వనిత, రోజా, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, మేకతోటి సుచరిత, పాముల పుష్పశ్రీవాణి, కారుమూరి నాగేశ్వరరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెడ్డి శాంతి, గ్రంధి శ్రీనివాసరావు ఉన్నారనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ జాబితా ఎంత వరకు నిజమనే విషయం రాబోయే రోజుల్లో తేలిపోనుంది.