Andhra Pradesh: ఏపీలో 840 మంది కేజీబీవీ టీచర్ల తొలగింపు.. టీచర్ల ఆందోళన

AP government sacked 840 teachers working in KGBVs across the state
  • ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న వారిని అర్ధాంతరంగా తొలగించిన వైనం
  • కొత్త నియామకాల పేరుతో ఇంటికి పంపించిన ప్రభుత్వం
  • కాంట్రాక్టు పద్ధతిలో తమనే తీసుకోవాలంటూ టీచర్ల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) లో పనిచేస్తున్న 840 మంది పార్ట్ టైం, గెస్ట్ టీచర్లను జగన్ సర్కారు తొలగించింది. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను అర్ధాంతరంగా రోడ్డున పడేసింది. కొత్త నియామకాల పేరుతో తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాంట్రాక్టు పద్ధతిలో తమనే తీసుకోవాలని పార్ట్ టైం టీచర్లు కోరినా పట్టించుకోవడంలేదు. దీంతో కొత్త నియామకాల్లో తమను సర్దుబాటు చేయాలంటూ గురువారం టీచర్లు ఆందోళన చేశారు. విద్యార్హతలు, బోధనా సామర్థ్యం పరీక్షించాకే తమను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, ప్రస్తుతం ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చి తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేజీబీవీల్లోని ఇంటర్మీడియట్‌ బోధనకు గతంలో నియమితులైన తెలుగు, ఆంగ్ల ఉపాధ్యాయినులను పోస్టుల సర్దుబాటు పేరుతో ప్రభుత్వం ఇంటికి పంపించింది. కొత్తగా కాంట్రాక్టు పద్ధతిలో 1,543 నియామకాలకు గత నెలలో సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. వందకు వంద మార్కులు వెయిటేజీ అంటూ నోటిఫికేషన్ లో పేర్కొనడంతో పాటు బోధన సర్వీసుకు ఏడాదికి అర మార్కు చొప్పున వెయిటేజీ ఇచ్చింది. అయితే, ఎనిమిదేళ్లు అదే కేజీబీవీలలో పనిచేసిన పార్ట్ టైం, గెస్ట్ టీచర్లకు 4 మార్కులకు మించి రావడం లేదు.

కొత్త నోటిఫికేషన్ లో భాగంగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 4,243 మంది జాబితాను ఎస్‌ఎస్‌ఏ జిల్లాలకు పంపించింది. ఆయా జిల్లాల్లో గురువారం ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. శుక్ర, శనివారాల్లో డెమో నిర్వహించి, ఆదివారం నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్‌ రూపొందించారు. అయితే, ఎస్ఎస్ఏ పంపిన జాబితాలో కొంతమంది అభ్యర్థులకు వందకు వంద మార్కులు వచ్చినట్లు చూపడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నియామకాల పేరుతో పోస్టులను అమ్ముకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టును బట్టి లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. జిల్లాల్లో డెమో, నైపుణ్యాల పరిశీలనకు 15 మార్కుల వెయిటేజీ ఉండటంతో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Andhra Pradesh
KGBV
part time teachers
jagan govt
YSRCP

More Telugu News