TTD: బాలుడిపై చిరుత దాడి నేపథ్యంలో.. టీటీడీ కీలక నిర్ణయాలు
- అలిపిరి ఏడో మైలు వద్ద నిన్న బాలుడిపై చిరుత దాడి
- రాత్రి ఏడు తర్వాత అలిపిరి నడక మార్గంలో భక్తుల బృందాన్ని పంపించేలా ఏర్పాట్లు
- భక్తులతో పాటు సెక్యూరిటీ ఉండేలా ఏర్పాట్లు
- చిన్నపిల్లలు ఈ బృందంలో మధ్యలో ఉండేలా చూసుకోవాలని సూచన
తిరుమలలో అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... దాడి చేసింది పిల్ల చిరుత అని, అందుకే బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. పిల్ల చిరుత దాడి చేసినప్పుడు తోటి భక్తులు పెద్దగా అరిచారని, అలాగే రిపీటర్ స్టేషన్ నుండి లైట్లు వేయడంతో బాలుడిని వదిలేసి పారిపోయిందన్నారు. టీటీడీ అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుండి నరసింహస్వామి దేవాలయం వరకు చిరుత సంచరిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో రాత్రి ఏడు గంటల తర్వాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుండి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపించేలా ఏర్పాట్లు చేశామని, వీరితో పాటు సెక్యూరిటీ గార్డు ఉంటారని, భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ ముందుకు సాగుతారన్నారు. చిన్నపిల్లలు బృందంలో మధ్యలో ఉండేలా చూసుకొని ముందుకు సాగుతారన్నారు.
చిరుతను పట్టుకోవడానికి ఏర్పాట్లు చేశామని, కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. శ్రీవారి మెట్ల మార్గంలో సాయంత్రం ఆరు గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి పది గంటల వరకు భక్తులను అనుమతిస్తారన్నారు. సాయంత్రం ఆరు తర్వాత ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాలపై వెళ్లే వారి భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు.