Dundi Rakesh: శ్రీవాణి ట్రస్ట్ నిధుల లెక్క తేల్చమంటే నోరెందుకు మెదపడం లేదు?: టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేశ్

Dundi Rakesh asks why do not TTD reveal Srivani Trust details

  • తిరుమల శ్రీవారి ట్రస్ట్ పై ఆరోపణలు
  • శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ చట్టవిరుద్ధమన్న డూండీ రాకేశ్
  • కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు
  • టీటీడీ శ్వేతపత్రంలో అన్నీ అబద్ధాలే చెప్పారని వెల్లడి

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్ట్ చట్టవిరుద్ధం అని టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేశ్ పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి ఇప్పటికే వివిధ రకాల టికెట్లు అందుబాటులో ఉండగా... శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దర్శనానికి రూ.10 వేలతో ప్రత్యేకంగా టికెట్ పెట్టి వచ్చిన కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ పై టీటీడీ విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్నీ అవాస్తవాలు చెప్పారని డూండీ రాకేశ్ ఆరోపించారు. 

"నాలుగేళ్లలో శ్రీవాణి ట్రస్ట్ కు రూ.1500 కోట్ల నగదు వస్తే... రూ.861 కోట్లే ఉన్నాయని శ్వేతపత్రంలో వెల్లడించారు. మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి. శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగం విషయంలో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మాజీ మంత్రి వెల్లంపల్లి తీరు ఉంది. 

శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ కు నగదు చెల్లించడం విడ్డూరంగా ఉంది. నాలుగేళ్లుగా రశీదులు కూడా ఇవ్వలేదు. దేవుడి దర్శనానికి ఇచ్చే నగదు ట్రస్ట్ కు వెళ్లడంలోనే మతలబు దాగి ఉంది. రూ.10 వేల రూపాయల టికెట్లను అంగడి సరుకుగా మార్చారు. భక్తుల నుంచి కేవలం నగదు రూపంలోనే స్వీకరించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇప్పటివరకు ఆడిట్ ఎందుకు జరగలేదో సమాధానం లేదు?

 ఆలయాలను పునరుద్ధరిస్తామంటూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గం. సరైన లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. 

తిరుమల కొండకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనాన్ని దుర్లభం చేస్తున్నారు. టీటీడీని వ్యాపార సంస్థగా మార్చి సామాన్య భక్తుల జేబులు గుల్లచేస్తున్నారు. కొండపై గదుల అద్దెలు 11 వందల శాతం పెంచారు. లడ్డూల ధరలు పెంచారు. ఇప్పటికైనా టీటీడీని వ్యాపార సంస్థగా మార్చడాన్ని మానుకోవాలి. శ్రీవాణి ట్రస్ట్ పై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తించాలి" అని డూండీ రాకేశ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News