Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ రాజీనామా
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కటీల్ రాజీనామా
- తన రెండేళ్ల పదవీకాలం ముగిసిందని వెల్లడించిన నళిన్
- నిర్ణయం అధిష్ఠానం చేతిలో ఉందని వెల్లడి
దక్షిణ కన్నడ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ శనివారం కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కటీల్ రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా రెండేళ్ల పదవీకాలం ముగిసింది. ఈ కారణంగా నేను రాజీనామా చేశాను' అని అతను తెలిపారు.
తన రాజీనామాను సమర్పిస్తూ ఆయన మాట్లాడుతూ... తాను చేయాల్సింది చేశానని, ఇప్పుడు నిర్ణయం పార్టీ అధిష్ఠానం చేతిలో ఉందన్నారు. కాగా దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే బీజేపీ నిన్నటి వరకు అధికారంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలవడంతో కటీల్ తన పదవికి రాజీనామా చేశారు. 224 సభ్యుల అసెంబ్లీలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ 136 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 65 సీట్లకే పరిమితమైంది.
కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుల్లో ఒకరు. ఇతను లవ్ జిహాద్, కరోనా వంటి అంశాలపై వ్యాఖ్యలు చేసి, కాంగ్రెస్ నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని డ్రగ్ అడిక్ట్ అంటూ కటీల్ తీవ్ర విమర్శలు చేశారు. సిద్ధరామయ్యను టెర్రరిస్ట్ అన్నారు. సిద్ధరామయ్య ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకుని తాలిబాన్‌తో సమానమని వ్యాఖ్యానించిన సమయంలోను నిప్పులు చెరిగారు.