Hyderabad: ఉద్యోగం నుంచి తీసేశాడని యజమానిపై కక్ష.. స్నేహితులతో కలిసి రూ. 40 లక్షల దోపిడీ

Rs 40 Lakhs Extortion Case Chased In 24 Hours In Hyderabad
  • ఆటోమొబైల్ గ్యారేజీలో అకౌంటెంట్‌గా పనిచేసిన అనిల్‌కుమార్
  • గ్యారేజ్‌లో పనిచేస్తున్న మెకానిక్‌తో కలిసి కుట్ర
  • రూ. 40 లక్షలు తీసుకొస్తుండగా కారును అడ్డగించి దోపిడీ
  • 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
సినీ ఫక్కీలో కారును అడ్డగించి రూ. 40 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. మల్లికార్జున్ బౌరంపేటలో దుర్గా ఆటోమొబైల్ గ్యారేజీ నిర్వహిస్తున్నారు. సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన జాల అనిల్‌కుమార్ (30) గతంలో ఆయన వద్ద అకౌంటెంట్‌గా పనిచేశాడు. రెండు సంవత్సరాల క్రితం అనిల్‌కుమార్‌ను విధుల  నుంచి తొలగించడంతో మల్లికార్జున్‌పై పగ పెంచుకున్నాడు. 

గ్యారేజీలో పనిచేస్తున్న మల్లేశ్‌తో కలిసి కుట్ర పన్నాడు. రెండు రోజుల క్రితం మాదాపూర్‌కు చెందిన తన స్నేహితుడి నుంచి రూ. 40 లక్షలు తీసుకురావాలంటూ ప్రస్తుత అకౌంటెంట్ సాయిరాం, మెకానిక్ మల్లేశ్‌కు చెప్పి మల్లికార్జున్ పంపాడు. ఈ విషయాన్ని అనిల్‌కుమార్‌కు మల్లేశ్ చేరవేశాడు. సూరారంలోనే ఉండే తన స్నేహితులు ఎం.శివచరణ్, ఎస్. వెంకటరమణరాజు, ఈ.రాజుతో కలిసి శుక్రవారం ఉదయం బౌరంపేట వద్ద కారును అడ్డగించి సాయిరాంను నెట్టేసి డబ్బున్న బ్యాగుతో పరారయ్యారు.

కేసు  నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుల ఫోన్ కాల్స్‌పై నిఘాపెట్టారు. వాటి ఆధారంగా 24 గంటల్లోపే మల్లేశ్, అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు నిన్న పట్టుబడ్డారు. దోచుకున్న నగదుతో నిందితులు ఐఫోన్‌తోపాటు మరో ఖరీదైన ఫోన్‌ను కొనుగోలు చేశారు. వారి నుంచి రూ. 37.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Hyderabad
Crime News
Hyderabad Police
Extortion Case

More Telugu News