KCR: 600 వాహనాలతో మహారాష్ట్రకు బయల్దేరిన కేసీఆర్.. వీడియో ఇదిగో
- రెండు రోజుల పర్యటనకు పయనమైన కేసీఆర్
- కేసీఆర్ వెంట ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు
- రేపు సోలాపూర్ జిల్లాలో భారీ బహిరంగసభ
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్ తో ఆయన రోడ్డు మార్గంలో పయనమయ్యారు. ఆయన వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.
మధ్యాహ్నం 1 గంటలకు మహారాష్ట్రలోని ధారిశివ్ జిల్లాలోని ఒమర్గాకు వీరంతా చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి సాయంత్రం 4.30 గంటలకు సోలాపూర్ కు బయల్దేరుతారు. ఈ రాత్రికి సోలాపూర్ లోనే బస చేస్తారు. రేపు ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురంకు చేరుకుని... అక్కడి విఠోభారుక్మిణి మందిర్ లో కేసీఆర్, ఇతర నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత సోలాపూర్ జిల్లా సర్కోలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సభలోనే ప్రముఖ నేత భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. అనంతరం ధారాశివ్ జిల్లాలో కొలువైన తుల్జాభవాని అమ్మవారిని (శక్తిపీఠం) దర్శించుకుని హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు.