circumcision: నత్తి పోయేందుకు ఆపరేషన్ కి వెళితే.. సున్తీ చేసిన వైద్యులు!
- రెండున్నరేళ్ల బాలుడికి నత్తి సమస్య
- గొంతు సర్జరీ చేయించుకోవాలని సూచించిన వైద్యులు
- ఆసుపత్రిలో చేరిన బాలుడికి సున్తీ చేసిన వైనం
వైద్య సేవల్లో పెద్ద తప్పిదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఓ హస్పిటల్ రెండున్నరేళ్ల చిన్నారికి ఒక సమస్యకు బదులు మరో సమస్యకు చికిత్స చేశారు. బరేలీలో ఇది చోటు చేసుకుంది. డిస్ట్రిక్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బల్బీర్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం తమ రెండున్నరేళ్ల కుమారుడికి నత్తి సమస్య ఉండడంతో ఎం ఖాన్ హస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ టంగ్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. కానీ వైద్యులు గొంతుకు శస్త్రచికిత్స చేయకుండా, తమ కుమారుడికి సున్తీ చేసినట్టు సదరు కుటుంబం ఆరోపిస్తోంది.
వైద్య శాఖకు చెందిన ముగ్గురు సభ్యుల బృందాన్ని ఎం ఖాన్ ఆసుపత్రికి విచారణ కోసం పంపించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ ప్రకటించారు. ఆరోపణలు రూఢీ అయితే డాక్టర్, హస్పిటల్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సైతం రద్దు చేయాలని ఆదేశించారు. 24 గంటల్లో సదరు కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. రిపోర్ట్ లోని అంశాల ఆధారంగా ఈ చర్యలు తీసుకోనున్నారు.