employees: ఉద్యోగుల మనసు గెలిచేందుకు కేంద్రం ఎత్తుగడ.. పెన్షన్ లో మార్పులు!
- చివరిగా పొందిన వేతనంలో 40 శాతం పెన్షన్
- తద్వారా ఉద్యోగుల మనసు చూరగొనే యత్నం
- దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం
కేంద్ర సర్కారు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) లో మార్పులు చేయనుందని సమాచారం. ఉద్యోగులు తమ సర్వీసులో చివరిగా డ్రా చేసిన వేతనంలో కనీసం 40 శాతాన్ని పెన్షన్ గా పొందే విధంగా నిబంధనలు మార్చనుంది. ఇందుకు సంబంధించి ఓ కమిటీని కేంద్రం నియమించగా, సదరు కమిటీ నివేదిక ఇంకా సమర్పించాల్సి ఉంది. ఈ లోపే దీనిపై కేంద్రం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
2004లో కేంద్ర, రాష్ట్రాల ఉద్యోగులకు కొత్తగా ఎన్ పీఎస్ పేరుతో పెన్షన్ స్కీమ్ ను తీసుకురావడం తెలిసిందే. అంతకుముందు వరకు కచ్చితమైన హామీతో కూడిన పెన్షన్ విధానం అమల్లో ఉండేది. ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాలు ఎన్ పీఎస్ వద్దనుకుని పాత పెన్షన్ విధానానికి మళ్లాయి. ఉద్యోగులు సైతం పాత పింఛను విధానానికే డిమాండ్ చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులు చివరిగా పొందిన వేతనంలో 50 శాతం తిరిగి పెన్షన్ గా లభిస్తుంది. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉద్యోగుల కీలక డిమాండ్ అయిన పెన్షన్ పై కేంద్ర సర్కారు దృష్టి సారించింది.
చివరిగా డ్రా చేసే నెలవారీ వేతనంలో కనీసం 40 శాతం పింఛను చెల్లించాలంటే 2004 నాటి పెన్షన్ ప్లాన్ కు కేంద్రం సవరణలు చేయాల్సి ఉంటుంది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానానికి మారిపోయాయి. కనీసం 40 శాతం పింఛను విషయంలో ఏమైనా లోటు ఏర్పడితే ఆ మేరకు కేంద్ర సర్కారు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఎన్ పీఎస్ లో రాబడులు మార్కెట్ పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. దీంతో ఉద్యోగి 60 ఏళ్ల నాటికి ఏర్పడిన నిధి ఎంతన్నదానిపైనే పెన్షన్ ఆధారపడి ఉంటుంది.