Rahul Gandhi: ఆ నినాదంతో ముందుకెళ్లండి: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ
- రాహుల్ తో సమావేశమైన 35 మంది నేతలు
- గతంలో పార్టీని వదిలి వెళ్లినవారు తిరిగి వస్తుండటం ఆనందంగా ఉందన్న రాహుల్
- తెలంగాణలో ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతోందని వ్యాఖ్య
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం భేటీ అయ్యారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ కు చెందిన దాదాపు 35 మంది నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కలిశారు. గతంలో పార్టీని వదిలి వెళ్లినవారు తిరిగి వస్తుండటం ఆనందంగా ఉందని రాహుల్ అన్నట్లు చెప్పారు. తెలంగాణలో ఘర్ వాపసీ కార్యక్రమం జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు పార్టీ నేతలు అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో అనే నినాదంతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలని నేతలకు రాహుల్ సూచించారని చెబుతున్నారు.
రాహుల్ గాంధీని కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, జానారెడ్డి, మధుయాష్కీ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, గుర్నాథ్ రెడ్డి ఉన్నారు. జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి, ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరాలని నేతలు భావిస్తున్నారు.