Raj Nath Singh: ఒబామా హయాంలో ముస్లిం దేశాలపై దాడులను మరిచిపోవద్దు: రాజ్‌నాథ్ సింగ్
- ఒబామా మైనార్టీ హక్కుల రక్షణ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేంద్రమంత్రి
- ప్రపంచ ప్రజలందరినీ భారత్ ఒక కుటుంబంలా చూస్తుందని వ్యాఖ్య
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, నిర్మలా సీతారామన్ కూడా ఆగ్రహం
భారత్ లో మైనార్టీ హక్కులపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తోన్న ప్రజలందరినీ భారత్ ఒక కుటుంబంలా భావిస్తుందని ఒబామా మరిచిపోవద్దన్నారు. ఆయన హయాంలో ముస్లిం దేశాలపై దాడులు జరిగాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తాను ప్రధాని మోదీతో మాట్లాడితే భారత్ లోని మైనార్టీ హక్కుల గురించి ప్రస్తావిస్తానని, వారి హక్కులను పరిరక్షించకుంటే భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముందని ఒబామా వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
రాజ్ నాథ్ తో పాటు ఇతర కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. భారత్ లో ప్రస్తుతం అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, 1984 నాటి తరహా అల్లర్లు చోటు చేసుకోవడం లేదని నఖ్వీ అన్నారు.
నిన్న నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతూ... ఒబామా వ్యాఖ్యలపై మాట్లాడేందుకు తాను చాలా ఆలోచిస్తున్నానని, ఎందుకంటే ఇది రెండు దేశాలతో ముడివడిన అంశమన్నారు. మేం అమెరికాతో స్నేహం కోరుకుంటుంటే.. అక్కడ మాత్రం భారత్ లో మతస్వేచ్ఛ, మైనార్టీల హక్కుల గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒబామా హయాంలో ఆరు ముస్లిం దేశాలపై బాంబులతో విరుచుకు పడ్డారని గుర్తు చేశారు. 26,000 బాంబులను ప్రయోగించినట్లు లెక్కలు చెబుతున్నాయని, అలాంటి వ్యక్తి మాటలను ఎవరైనా నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు.