meerut: కమిషనర్ గారి పెంపుడు కుక్క తప్పిపోయిండట.. 36 గంటల్లో 500 ల ఇళ్లల్లో వెతికిన మీరట్ పోలీసులు
- ఆగమేఘాల మీద స్పందించిన పోలీసులు
- ఇంటింటికీ తిరుగుతూ కుక్క కోసం వెతుకులాట
- నిద్రాహారాలు మాని మరీ గాలించినా దొరకని ఆచూకీ
సిటీ మొత్తానికీ బాస్ ఆవిడ.. ఎంతో ప్రేమగా ఓ కుక్కను పెంచుకుంటోంది. అలాంటి కుక్కలు సిటీ మొత్తానికి పంతొమ్మిది మాత్రమే ఉన్నాయి. అంత ప్రేమగా పెంచుకునే కుక్క ఆదివారం సాయంత్రం నుంచి కనిపించట్లేదట. ఈ విషయం తెలియగానే పోలీసులు ఆగమేఘాల మీద స్పందించారు. నిద్రాహారాలు మాని మరీ కుక్క కోసం గాలించడం మొదలుపెట్టారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి కేవలం 36 గంటల్లో సిటీలోని 500 ఇళ్లల్లో గాలించారు. అయినా కుక్క జాడ మాత్రం దొరకలేదు.
మీరట్ మున్సిపల్ కమిషనర్ సెల్వకుమారి ప్రేమగా పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ కుక్క ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. కమిషనర్ ఇంట్లో సెంట్రీ విధులు నిర్వహించే సిబ్బందితో పాటు సిటీ పోలీసులు కూడా ఆ కుక్క కోసం ఇళ్లన్నీ జల్లెడపడుతున్నారు. సిటీలో ఆనిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ హర్పాల్ సింగ్ అర్ధరాత్రి కమిషనర్ ఇంటికి చేరుకుని కమిషనర్ పెంపుడు శునకం పేరు, ఫొటో వివరాలు తీసుకుని స్వయంగా వెతకడం మొదలు పెట్టారు. అయినా ఉపయోగంలేకుండా పోయింది. ఎవరైనా ఎత్తుకెళ్లారేమోనని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు.. అయినా కమిషనర్ పెంపుడు శునకం మాత్రం దొరకలేదట!