White House: మోదీని ప్రశ్నించిన అమెరికా జర్నలిస్టుకు వేధింపులు.. ఖండించిన వైట్ హౌస్
- మైనారిటీ హక్కులపై మోదీకి వాల్ స్ట్రీట్ విలేకరి ప్రశ్న
- ప్రజాస్వామ్యంలో వివక్షకు తావులేదన్న మోదీ
- విలేకరికి ఆన్ లైన్ లో వేధింపులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. అయితే, ఈ సమావేశంలో మోదీని ప్రశ్నించిన వాల్ స్ట్రీట్ జర్నల్ విలేకరి ప్రస్తుతం వేధింపులకు గురవుతోందట. భారత్ లో ముస్లింలు సహా ఇతర మైనారిటీల హక్కుల విషయాన్ని ప్రశ్నించినందుకు తమ జర్నలిస్టును ఆన్ లైన్ లో వేధిస్తున్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. దీనిపై తాజాగా వైట్ హౌస్ ఉన్నతాధికారి జాన్ కిర్బీ స్పందించారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ విలేకరి సబ్రీనా సిద్దిఖీ సైబర్ వేధింపులకు గురవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని జాన్ కిర్బీ చెప్పారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులపై ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి రకమైన దాడి అయినా ఖండించాల్సిందేనన్నది అమెరికా ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలా వేధింపులకు గురిచేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి పనికిరాదని వ్యాఖ్యానించారు.
మోదీని సబ్రీనా ఏమడిగారంటే..
‘భారత్ లో ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల పక్షపాతంపై మీరేమంటారు.. ఇండియాలో మైనారిటీల హక్కులను కాపాడేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అని ప్రధాని మోదీని సబ్రీనా ప్రశ్నించారు. దీనికి జవాబిస్తూ.. ఈ ప్రశ్న తనను సర్ ప్రైజ్ చేసిందని అన్నారు. మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యమే మన ఆత్మ అని, పక్షపాతానికి ప్రజాస్వామ్యంలో చోటులేదని ప్రధాని చెప్పుకొచ్చారు.