Etela Rajender: బీజేపీ నుంచి నేను వెళ్లిపోవాలని కోరుకునే వాళ్లు పార్టీలోనే ఉన్నారు: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
- బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారే వ్యక్తిని కాదన్న ఈటల
- కొందరు చిల్లరగాళ్లు కోరుకున్నట్లుగా తాను ఈజీగా నిర్ణయం తీసుకోనని వ్యాఖ్య
- తనను కించపరిచేవారు కొంతమంది పార్టీలో ఉన్నారని ఆరోపణ
- బీఆర్ఎస్ బయటికి పంపిస్తే.. బీజేపీ అక్కున చేర్చుకుందని వెల్లడి
తాను బీజేపీ నుంచి వెళ్లిపోవాలని కోరుకునే వాళ్లు కొంతమంది పార్టీలో ఉన్నారంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది వాళ్ల ఖర్మ అని, దానికి తానేం చేయలేనని చెప్పారు. ‘‘నేను వెళ్లిపోవాలని కోరుకునే వాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్లెవరో ఇప్పటికే అందరికీ తెలుసు. నన్ను కించపరిచేవారు కొంతమంది పార్టీలో ఉన్నారు. వాళ్ల గురించి నేను పట్టించుకోను” అని ఈటల స్పష్టం చేశారు.
బట్టలు మార్చినంత ఈజీగా తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. కొందరు చిల్లరగాళ్లు కోరుకున్నట్లుగా తాను ఈజీగా నిర్ణయం తీసుకోనని చెప్పారు. తాను ఎప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతానా అని తమ పార్టీలోనే కొందరు ఎదురుచూస్తున్నారన్నారు. భగావో అని చెప్పేవాళ్లు, అవమానించేవాళ్లు ఉన్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ తనను బయటకు పంపిస్తే.. బీజేపీ అక్కున చేర్చుకుందని అన్నారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌కు అహంకారం పెరిగింది. చిన్న రాష్ట్రాన్ని పాలించే సత్తా లేదు కానీ ఇంకేదో చేస్తారట. కేసీఆర్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు” అని చెప్పారు. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం అసలు లేదని చెప్పారు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారని అన్నారు.