Bulldozer action: యూపీలో మరో నిందితుడికి బుల్డోజర్ ట్రీట్ మెంట్
- 19 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
- నిందితుడి ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు
- నేరస్థులు భయపడేలా యోగి సర్కారు చర్యలు
ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి మార్క్ పాలన కొనసాగుతూనే ఉంది. నేరస్థుల విషయంలో యోగి సర్కారు అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్న సంగతి తెలిసిందే. మరోసారి నేరం చేయడానికి భయపడేట్టుగా అక్కడ చర్యలు ఉంటాయి. తాజాగా ఓ అత్యాచారం నిందితుడి ఇంటిని అక్కడి అధికారులు బుల్డోజర్ తో కూల్చివేశారు. ఫతేపూర్ పట్టణంలో ఇది చోటు చేసుకుంది. 19 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న సికిందర్ ఖాన్ అనే వ్యక్తి ఇంటిని నేలమట్టం చేశారు.
పోలీసులు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫరీద్ పూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఈ నెల 23న ఓ బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఖాన్ తన పలుకుబడితో బాలికను ట్రాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధిత కుటుంబం ఆరోపించింది. దీన్ని లవ్ జిహాద్ గా కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.