Lakshmi Parvati: జగన్ వల్ల మళ్లీ స్కూల్ కు వెళ్లి చదువుకోవాలనిపిస్తోంది: లక్ష్మీపార్వతి
- విద్యారంగంలో జగన్ సంస్కరణలు అద్భుతమన్న లక్ష్మీపార్వతి
- స్కూళ్లను తీర్చిదిద్దిన విధానం చూస్తే అదిరిపోతామని వెల్లడి
- అధికారం అంటే దోపిడీ చేయడం కాదంటూ చంద్రబాబుపై విమర్శలు
రాష్ట్ర విద్యారంగంలో సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు ఎంతో ప్రభావం చూపిస్తున్నాయని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. విద్యారంగాన్నే తీసుకుంటే... నాడు-నేడు కింద స్కూళ్లను తీర్చిదిద్దిన విధానం చూస్తే అదిరిపోతాం అని తెలిపారు. విద్యారంగంలో జగన్ చేసిన మార్పులు చూస్తుంటే మళ్లీ స్కూల్ కు వెళ్లి చదువుకోవాలనిపిస్తోందని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి... రెండు కళ్లుగా భావించి యువనేత సీఎం జగన్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని లక్ష్మీపార్వతి కొనిడాయారు.
"విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం, విద్యాబోధనలో డిజిటలైజేషన్, ఒకటో తరగతి నుంచే పిల్లలకు అమ్మ ఒడి సహా అన్ని పథకాలు వర్తింపజేయడం, వారికి బట్టలు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, స్కూళ్లలో చక్కని బెంచీలు, బోర్డులు, పరిశుభ్రమైన టాయిలెట్లు... ఇదండీ పరిపాలన అంటే. ఎవరికి ఏది అవసరమో అది అందించేదే నిజమైన పరిపాలన అవుతుంది.
అధికారం అంటే దోపిడీ చేయడం కాదు. చంద్రబాబూ, నువ్వు ఐదు లక్షల కోట్లు సంపాదించవచ్చు కానీ నీ చరిత్రను ఎంత హీనంగా రాస్తారో అర్థమవుతోందా? నీ కొడుకుకైనా సంస్కారం నేర్పించావా అంటే అదీ లేదు. ఓ పనికిమాలిన వెధవలా తయారుచేశావు. వాడికి మూడు శాఖలతో మంత్రి పదవి ఇచ్చావు... వాడికి చదవడం రాదు, రాయడం రాదు" అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.