KTR: ఏపీలో రాజకీయం చేస్తామన్న కేటీఆర్,... ఈటల, పవన్ కల్యాణ్, షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు
- అప్పులు ఎందుకు చేస్తున్నామో చూడాలన్న కేటీఆర్
- పొంగులేటి, జూపల్లికి టిక్కెట్ ఇస్తే మంచివారమా? అని ప్రశ్న
- తప్పు చేసిన వారికి ఈసారి టిక్కెట్ రాకపోవచ్చునని వెల్లడి
- ఈటలకు భద్రత కల్పిస్తామని చెప్పిన కేటీఆర్
తాము ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పవన్ కల్యాణ్, జగన్, లోకేశ్ లు తనకు స్నేహితులని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన షర్మిల ఇక్కడ ఓట్లు ఎలా అడుగుతుందని నిలదీశారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరికలు లేవన్నారు. ఎమ్మెల్యేను, మంత్రిని అవుతానని అనుకోలేదన్నారు. ఆయన ఓ ఛానల్ తో ముఖాముఖిలో వివిధ అంశాలపై స్పందించారు.
అప్పులపై ఏమన్నారంటే...
అప్పులు చేసి దేనికి ఖర్చు చేస్తున్నామనేది చూడాలన్నారు. కాళేశ్వరం కోసం రూ.1 లక్ష కోట్లు, గొర్రెల పంపిణీకి రూ.11వేల కోట్లు, కరెంట్ కోసం రూ.81వేల కోట్లు, తాగునీటి కోసం రూ.4 వేల కోట్లు... ఇలా ప్రజా సంక్షేమం కోసం అప్పులు తెచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అప్పులు తెచ్చిందని గుర్తు చేశారు. తాము ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పు చేస్తున్నామన్నారు. ఆర్థిక పరిమితికి లోబడి అప్పు చేయవచ్చునన్నారు. ప్రజలకు మేలు చేసే రంగాల్లో అప్పు చేస్తే దానిని భవిష్యత్తు పెట్టుబడిగా చూడాలన్నారు.
హైదరాబాద్ మెట్రోలో కెనడా పెన్షనర్ల డబ్బులు
హైదరాబాద్ మెట్రోలో కెనడా పెన్షనర్ల డబ్బులు ఉన్నాయని, కానీ మన పెన్షనర్ల ఫండ్స్ బ్యాంకుల్లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో తాము 35 ఫ్లైఓవర్లు కట్టామని చెప్పారు. ఒకచోట చిన్న సంఘటన జరిగితే రాద్దాంతం చేశారని వాపోయారు.
ముప్పై ఏళ్లకు ఔటర్ రింగ్ రోడ్డును అప్పగించేందుకు బిడ్లు పిలిచామన్నారు. ప్రభుత్వానికి రూ.7,380 కోట్లు వస్తాయన్నారు. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హెచ్ఎండీఏ పరువు నష్టం దావా వేసిందన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదన్నారు. రేవంత్ గతంలో సోనియా గాంధీని విమర్శించి, ఇప్పుడు అదే కాంగ్రెస్ లో ఉన్నాడని ఎద్దేవా చేశారు.
గోడలకు రంగులు వేసుకునే వాళ్లకు జూబ్లీహిల్స్ లో స్థలాలు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు పెద్ద కుంభకోణమని ఆరోపించారు. నయీంను పెంచిపోషించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.
తప్పు చేసిన వారికి టిక్కెట్ రాకపోవచ్చు
తప్పు చేసిన వారికి ఈసారి టిక్కెట్ రాకపోవచ్చునని చెప్పారు. టిక్కెట్లను ముందస్తుగానే ప్రకటిస్తామన్నారు. గవర్నర్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. ఉద్యమ పార్టీ అయినప్పటికీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చుకున్నామని, అందుకే గతంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లు కూడా కేబినెట్లో ఉన్నారని చెప్పారు.
తాము ఇతర పార్టీల నుండి నాయకులను చేర్చుకున్నామని తెలిపారు. అదే సమయంలో ఉద్యమకారులను ఆదుకున్నామన్నారు. అధికారులపై ఆధారపడి తాము రాజకీయాలు చేయమన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందని, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారని ఆరోపించారు.
తనపై అవినీతి ఆరోపణలు చేసేవారికి కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. గ్లోబరీనాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. డ్రగ్స్ కేసుతోను సంబంధం లేదన్నారు. తనకు సీఎం కావాలనే ఆలోచన లేదన్నారు. అదానీపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఐటీ మంత్రికి, టీఎస్పీఎస్సీకి ఏమైనా సంబంధం ఉందా? అన్నారు.
ఏపీలో రాజకీయం చేస్తాం... పవన్ మంచి మిత్రుడు..
తాము ఏపీలో కచ్చితంగా రాజకీయం చేస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని, తమ ఇద్దరి అభిరుచులు కలిశాయన్నారు. లోకేశ్, జగన్ కూడా తనకు మిత్రులే అన్నారు. కానీ ఆ నాయకులు బీజేపీకి ఆప్తులుగా మారారని ఎద్దేవా చేశారు.
ఈటలకు భద్రత కల్పిస్తానని వ్యాఖ్య
తెలంగాణ వద్దని షర్మిల గావుకేకలు పెట్టిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కు ప్రాణహానీ ఉందంటే తానే భద్రతను పెంచుతానని చెప్పారు. హత్యా రాజకీయాలు తమ సంస్కృతి కాదన్నారు. ఈటల తనకు సోదరుడి లాంటి వాడన్నారు. డీజీపీకి భద్రత పెంచమని చెబుతానన్నారు.
తాము టిక్కెట్ ఇస్తే పొంగులేటి, జూపల్లి పార్టీని వీడేవారా? అని ప్రశ్నించారు. టిక్కెట్ ఇస్తే మంచివాళ్లు, లేకుంటే కాదా? అని నిలదీశారు. తమకు బలమైన నాయకులు ఉన్నారు కాబట్టే వారిని పక్కన పెట్టామన్నారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని, కాంగ్రెస్ నుండి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.