Nara Lokesh: జగన్ ఫిష్ ఆంధ్ర... యువత భవిత ఫినిష్ ఆంధ్ర!... సెల్ఫీతో స్పందించిన లోకేశ్
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర
- గూడూరు నియోజకవర్గంలో ఫిష్ ఆంధ్రా దుకాణం వద్ద లోకేశ్ సెల్ఫీ
- దుకాణం మూతపడి ఉండడంపై వ్యంగ్యం
- విధ్వంసకర్త అంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ సహా వైసీపీ నేతలందరిపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో జరుగుతోంది.
ఈ సందర్భంగా ఓ ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్ మూతపడి ఉన్న దృశ్యాన్ని లోకేశ్ గమనించారు. ఆ ఫిష్ ఆంధ్రా దుకాణం వద్ద ఓ సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ పై విమర్శనాస్త్రం సంధించారు.
"ఇది గూడూరు నియోజకవర్గం కోట పట్టణంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన ఫిష్ ఆంధ్ర చేపల దుకాణం. చిత్తశుద్ది, అవగాహన లేమి కారణంగా ప్రారంభించిన కొద్దిరోజులకే ఫిష్ ఆంధ్ర కాస్త ఫినిష్ ఆంధ్రగా మారి, పులివెందులతో సహా రాష్ట్రంలోని అన్ని దుకాణాలు మూతబడ్డాయి. కియా, ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలతో విజనరీ చంద్రబాబు రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలిస్తే... చేపలు, మాంసం దుకాణాల పేరుతో జగన్ యువత భవితను అంధకారమయం చేశారు. విజనరీ పాలనకు, విధ్వంసకర్త వికృత చర్యలకు తేడా ఇదే తమ్ముళ్లూ..!" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.