rakesh master: అలా రాయకండి: రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మలో శేఖర్ మాస్టర్ భావోద్వేగం
- రాకేశ్ మాస్టర్ తో తనకు ఎనిమిదేళ్ల అనుబంధముందని చెప్పిన శేఖర్ మాస్టర్
- యూట్యూబ్ లో ఆయన డ్యాన్స్ చూసింది కేవలం 5 శాతమేనని వెల్లడి
- హైదరాబాద్ వచ్చాక రాకేశ్ మాస్టర్ ని అభిమానించడం ప్రారంభించానన్న రాకేశ్
ఎవరి గురించైనా రాసేటప్పుడు వాస్తవాలు రాయాలని యూట్యూబ్ ఛానెళ్లకు శేఖర్ మాస్టర్ విజ్ఞప్తి చేశారు. తన గురువు రాకేశ్ మాస్టర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ తో పాటు పలువురు హాజరయ్యారు. రాకేశ్ మాస్టర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ... రాకేశ్ మాస్టర్ చాలా గొప్ప డ్యాన్సర్ అన్నారు. తమది ఎనిమిదేళ్ల అనుబంధమన్నారు. రాకేశ్ మాస్టర్ డ్యాన్స్ కు సంబంధించి మీరంతా యూట్యూబ్ లో చూసింది కేవలం ఐదు శాతమేనని, ఆయన టాలెంట్ గురించి చాలామందికి తెలియదన్నారు.
వ్యక్తిగతంగా తాను కొంత ప్రభుదేవా నుండి స్ఫూర్తి పొందానని, హైదరాబాద్ వచ్చాక రాకేశ్ మాస్టర్ ని అభిమానించడం ప్రారంభించానని, ఆయన తన గురువు అని చెప్పేందుకు గర్వంగా ఉందని చెప్పారు. ఆయన అంత అద్భుతంగా డ్యాన్స్ చేసేవారన్నారు. ప్రాక్టీస్ చేసే సమయంలో చిన్న పొరపాటు జరిగినా ఊరుకునేవారు కాదన్నారు. ఆయన ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకున్నాను గానీ ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదన్నారు. ఆయన పెళ్లిని తామే చేశామని, అప్పట్లో డ్యాన్స్ తప్ప తమకు మరో ప్రపంచం తెలియదన్నారు.
తాము ఎప్పుడు మాస్టర్ దగ్గరే ఉండేవాళ్లమని, ఇనిస్టిట్యూట్ లో ఉదయం, సాయంత్రం క్లాసులు చెప్పేవాళ్లమన్నారు. కొన్ని యూట్యూబ్ చానెళ్ల వారు ఇష్టం వచ్చినట్లు థంబ్ నైల్స్ పెట్టి వార్తలు రాస్తున్నారని, దాంతో చాలామంది బాధపడుతున్నారన్నారు. ఈ విషయంలోనే కాదు.. ఎవరి విషయంలో అయినా వాస్తవాలు రాయాలని సూచించారు. లేదంటే ఊరుకోవాలన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ కాస్త ఎమోషనల్ అయ్యారు.