Tripura: త్రిపురలో జగన్నాథ ఉల్టా రథయాత్రలో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో ఆరుగురి మృతి
- త్రిపురలోని ఉనకోటి జిల్లా కుమార్‌ఘాట్‌లో ఘటన
- హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకిన రథం
- మరో 15 మందికి తీవ్ర గాయాలు
- మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం మాణిక్ సాహా
త్రిపురలోని ఉనకోటి జిల్లా కుమార్‌ఘాట్‌లో నిర్వహించిన జగన్నాథ ఉల్టా రథయాత్రలో తీరని విషాదం చోటుచేసుకుంది. రథం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతం జరిగి ఆరుగురు చిన్నారులు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఓ పురుషుడు ఉన్నారు. ఉల్టా రథయాత్రలో భాగంగా రథం నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో జగన్నాథ బారి ఆలయానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 20న జగన్నాథ రథయాత్ర ప్రారంభం కాగా, ఉల్టాయాత్ర దీనికి ముగింపుగా నిర్వహిస్తారు.
ప్రమాదంలో గాయపడిన వారిని కైలాషహర్‌లోని ఉనకోటి ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
నిన్న ఉదయం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో హెలికాప్టర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు అగర్తలా నుంచి ముఖ్యమంత్రి మాణిక్ షా రైలు ద్వారా కుమార్‌ఘాట్‌కు బయలుదేరారు. కాగా, ఈ విషాదంపై ప్రతిపక్ష తిప్రా మొత్తా చీఫ్ ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దెబ్బర్మ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.