Oscars: ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇంకా..!
- వచ్చే ఏడాది మార్చ్ లో జరగనున్న 96వ ఆస్కార్ అవార్డుల వేడుకలు
- 398 మంది కొత్త సభ్యులను జ్యూరీలోకి తీసుకున్న అకాడెమీ
- బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ కు కూడా చోటు
భారతీయ సినిమా ఖ్యాతిని 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డులను సాధించడమే కాక... ఇప్పుడు ఆ సినిమా టీమ్ ఏకంగా ఆస్కార్ జ్యూరీ మెంబర్లు అయ్యేంత గొప్ప స్థాయిని తీసుకొచ్చింది. వచ్చే ఏడాది మార్చ్ లో జరగనున్న 96వ ఆస్కార్స్ కు అప్పుడే సన్నాహకాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా 398 మంది కొత్త మెంబర్స్ ను జ్యూరీలోకి అకాడెమీ తీసుకుంది.
'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు సిరిల్ లను జ్యూరీలోకి అకాడెమీ ఆహ్వానించింది. నిర్మాతల కేటగిరీ నుంచి బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ కు కూడా స్థానం లభించింది. ఈ 398 మందిలో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కు కూడా చోటు కల్పించారు. మరోవైపు ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా తారక్, చరణ్ లకు స్థానం లభించడంతో వారి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.