Madonna: పాప్ గాయని మడొన్నాకు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స!

Madonna Hospitalised With Serious Infection
  • తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురైన మడొన్నా
  • శరీరం స్పందించని స్థితిలో ఆసుపత్రికి తరలింపు
  • శనివారం నుంచి న్యూయార్క్ లోని ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
ప్రముఖ పాప్ సింగర్ సింగర్ మడొన్నాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆమె వయసు 64 ఏళ్లకు చేరుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె శరీరం స్పందించలేని స్థితిలో ఉండటాన్ని గమనించి, వెంటనే ఆమెను న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. గత శనివారం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. 

ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని మడొన్నా మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె శరీరం తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురైందని చెప్పారు. ఆమెను ఐసీయూలోనే ఉంచి వైద్యులు చికిత్సను కొనసాగిస్తున్నారని తెలిపారు. మడొన్నా ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతోందని చెప్పారు. 

మడొన్నా అనారోగ్యానికి గురైన నేపథ్యంలో... ఆమె వరల్డ్ టూర్ తో పాటు ఇతర అన్ని కమిట్ మెంట్లను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు మేనేజర్ ప్రకటించారు. వరల్డ్ టూర్ తో పాటు ఇతర షోల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో మడొన్నాకు తోడుగా ఆమె కూతురు లియోన్ ఉన్నట్టు 'పేజ్ సిక్స్' పత్రిక తెలిపింది.
Madonna
Hospitalised
Hollywood

More Telugu News