Harish Rao: సాయిచంద్ మృతదేహం చూసి హరీశ్ రావు కంటతడి
- గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ గిడ్డంగుల
కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ - తెలంగాణ ఉద్యమ గాయకుడిగా పేరు తెచ్చుకున్న సాయిచంద్
- ఆసుపత్రిలో ఆయన మృతదేహాన్ని చూసి హరీశ్ రావు భావోద్వేగం
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఈ రోజు హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సాయి చంద్ మృతదేహాన్ని చూసి చలించిపోయారు. తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయి చంద్ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. తాను తమ్ముడిలా భావించే సాయిచంద్ మృతి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటు అని హరీశ్ రావు అన్నారు.
‘నాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని ఉర్రూతలూగించి, నేడు స్వరాష్ట్ర అభివృద్ధి విధానాన్ని ప్రజలకు పాట రూపంలో చెబుతున్న గొంతుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమ గాయకుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారు. జోహార్ సాయిచంద్’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.